అయోధ్య రాముడి వంటగదికీగ్యాస్ సెగ
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:46 AM
వంట గ్యాస్ కొరత తాలూకూ సెగ.. అయోధ్య రాముడి వంటగది సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల పాకశాలలను తాకింది.
గ్యాస్ కొరత వల్ల తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ‘రామ్ రసోయి’ బయట నోటీసు
న్యూఢిల్లీ, మార్చి 11: వంట గ్యాస్ కొరత తాలూకూ సెగ.. అయోధ్య రాముడి వంటగది సహా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల పాకశాలలను తాకింది. అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముణ్ని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులు.. అక్కడ ‘రామ్ రసోయి’లో పెట్టే ప్రసాదాన్ని భక్తితో ఆరగిస్తారు. రోజూ 10 వేల నుంచి 20 వేల మంది భక్తులకు అక్కడ ఉచిత భోజనం పెడతారు. కానీ.. ఎల్పీజీ కొరత కారణంగా తాత్కాలికంగా రామ్ రసోయిని మూసివేస్తున్నట్టు మంగళవారం మధ్యాహ్నం ఒక నోటీసు అతికించారు. అయితే.. దాన్ని పూర్తిగా మూసివేయలేదని, రోజూ ఉదయం పూట ప్రసాద వితరణ కొనసాగుతుందని, సాయంత్రం పూట మాత్రం మూసివేస్తామని నిర్వాహకులు తెలిపారు. బొగ్గు, కట్టెల వంటి సంప్రదాయ వనరులను ఉపయోగించి అయినా సరే, భక్తులకు రెండుపూటలా భోజనాలు పెట్టాలనే యోచనలో ఉన్నామని, ఎలక్ట్రిక్ కుక్కర్ల వంటివాటి వినియోగాన్నీ పరిశీలిస్తున్నామని ‘రామ్ రసోయి’ ఉన్న అవామా ఆలయ మేనేజర్ పంకజ్ కుమార్ తెలిపారు. అలాగే.. గ్యాస్ కొరత కారణంగా హనుమాన్ గఢీలో లడ్డూల తయారీని కూడా నిలిపివేశారు. ఇక.. కాశీ విశ్వనాథుడి గుడిలో ప్రసాదంగా పెట్టే భోజనంలో రెండు కూరలకు బదులు ఒకటే కూర పెడుతున్నారు. సేమ్యాతో చేసే పదార్థాలను మెనూలోంచి పూర్తిగా తొలగించారు. నిత్యం 35 వేల నుంచి 40 వేల మంది భక్తులకు భోజనం, 7 వేల మందికి అల్పాహారం పెట్టే షిర్డీలో ప్రస్తుతం 15 రోజులకు సరిపడ ఎల్పీజీ నిల్వ ఉన్నట్టు ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్నదానం, ప్రసాదాల తయారీకోసం అక్కడ రోజూ 2 టన్నుల గ్యాస్‌ను వినియోగిస్తారు. అత్యవసర వినియోగం నిమిత్తం 20 వేల కిలోల గ్యాస్‌ను రెండు ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. షిర్డీలో వంటకు సౌరశక్తిని కూడా వినియోగిస్తారు.
తద్వారా నిత్యం 200 కిలోల గ్యాస్‌ను ఆదా చేస్తారు. ఇక, కర్ణాటకలో.. మఠాల ఆధ్వర్యంలో నడిచే వేలాది దేవాలయాల్లో ఎల్పీజీ కొరత కారణంగా భోజనాలు, ప్రసాద వితరణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయంలో రెండువారాలకు సరిపడా గ్యాస్ నిల్వలున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత గ్యాస్ సరఫరా లేకపోయినా.. కట్టెలపై వంట చేస్తామని, అన్న ప్రసాద వితరణ మాత్రం నిలిపివేయబోమని ఆలయ అభివృద్ధి సంస్థ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇక.. ఢిల్లీలోని పేదలకు తక్కువధరలకే భోజనం అందించేందుకు ప్రభుత్వం నడుపుతున్న అటల్ క్యాంటీన్లలో 2-3 రోజులకు మాత్రమే సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని అటల్ క్యాంటీన్లలో గ్యాస్ కొరత కారణంగా మెనూలను కుదించినట్టు సమాచారం. అటు తమిళనాడులోనూ అమ్మ క్యాంటీన్లలో 3-4 రోజులకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు.. గ్యాస్ కొరత కారణంగా ప్రధాన ఆహారపదార్థాలను వండి వడ్డించలేమని.. కేవలం ఫ్రూట్ సలాడ్‌లు, ఫ్రూట్ చాట్‌లు, శాండ్‌విచ్‌ల వంటివాటిని మాత్రమే కొన్నాళ్లపాటు సరఫరా చేయగలమని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ నిర్వాహకులు బుధవారం అతికించిన నోటీసు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇక, రైళ్లలో ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఆహారం సరఫరా చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని.. వెండర్లకు ఐఆర్‌సీటీసీ సూచించింది.
మూత ముప్పు..
గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడే పరిస్థితి వస్తోందన్న ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల తయారీని నిలిపివేసి టీ, కాఫీలను మాత్రమే విక్రయిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పటికే 20ు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడగా.. శుక్రవారానికి ఆ సంఖ్య 50 శాతం దాటే ప్రమాదం కనిపిస్తోందని ‘ఆహార్’ ప్రతినిధి ఒకరు ఆందోళన వెలిబుచ్చారు. గ్యాస్ కొరత నేపథ్యంలో.. ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఇంధన ఆదా, ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై అడ్వైజరీని జారీ చేసింది. తక్కువ మొత్తాల్లో పలుమార్లు వండకుండా, ఒకేసారి పెద్దమొత్తంలో వండాలని, ప్రెజర్ కుక్కర్లను ఉపయోగించాలని, బియ్యం, పప్పు దినుసులను వండడానికి ముందు బాగా నానబెట్టాలని ఇండక్షన్ స్టవ్‌లను వాడాలని సూచించింది.