అశ్వగంధ ఆకులు ప్రమాదకరం
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:36 AM
ఆరోగ్య, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధను ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అశ్వగంధ వేళ్లు మాత్రమే సురక్షితమని, ఆకులు, వాటి సారాన్ని వాడడం...
లివర్,జీర్ణకోశం,నరాలపై తీవ్ర ప్రభావం
వాడకంపై ఎఫ్‌ఎస్ఎస్ఎఐ నిషేధం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఆరోగ్య, ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధను ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. అశ్వగంధ వేళ్లు మాత్రమే సురక్షితమని, ఆకులు, వాటి సారాన్ని వాడడం ప్రమాదకరమని భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ(ఎఫ్‌ఎస్ఎస్ఎఐ) పేర్కొంది. ఆకుల వాడకం వల్ల కాలేయానికి హాని కలగవచ్చని, జీర్ణ క్రియ సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చని, నరాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో ఆకుల వాడకంపై పూర్తి నిషేధం విధిస్తూ ఎఫ్‌ఎస్ఎస్ఎఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉల్లంఘించిన ఆహారోత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. అశ్వగంధను ఉపయోగిస్తున్న కంపెనీలు తప్పనిసరిగా తాము ఆ మొక్కలోని ఏ భాగాన్ని వాడుతున్నదీ పేర్కొనాలని ఆదేశించింది. అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎఫ్‌ఎస్ఎస్ఎఐపై ఉత్తర్వులు జారీ చేసింది. 2026లో అశ్వగంధ మార్కెట్ విలువ సుమారుగా రూ.8595 కోట్లు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాల్లో సుమారు 10,780 హెక్టార్లలో ఈపంటను సాగు చేస్తున్నారు. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో దీనికి డిమాండ్ పెరుగుతోంది. అలాగే టీ మిశ్రమంగా, బలవర్ధక పానీయంగానూ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో దీనిని పురుషులు ఎక్కువగా వాడుతున్నారు. బలం పెరగడానికి, సత్తువ కలగడానికి, లైంగిక ఆరోగ్యం మెరుగుదల కోసం, ప్రధానంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం కోసం అశ్వగంధను ఉపయోగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్
ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్