Share News

ఫార్చూనర్‌ కారులో వచ్చి.. రోడ్లు ఊడ్చి..

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:41 AM

అది కర్ణాటకలోని దక్షిణకన్నడ జిల్లా బంట్వాళలోని బీసీ రోడ్డు ప్రాంతం. సమయం ఉదయం 5 గంటలు. అప్పుడే ఓ ఫార్చూనర్‌ కారు వచ్చి ఆగింది...

ఫార్చూనర్‌ కారులో వచ్చి.. రోడ్లు ఊడ్చి..

  • బంట్వాళలో ఓ పారిశుధ్య కార్మికుడి దినచర్య

బెంగళూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అది కర్ణాటకలోని దక్షిణకన్నడ జిల్లా బంట్వాళలోని బీసీ రోడ్డు ప్రాంతం. సమయం ఉదయం 5 గంటలు. అప్పుడే ఓ ఫార్చూనర్‌ కారు వచ్చి ఆగింది...! అందులోనుంచి దిగిన వ్యక్తి.. చకచకా ముందుకు కదిలాడు. ఓ చీపురు తీసుకుని రోడ్లన్నీ శుభ్రంగా ఊడ్చారు. సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగానే... చీపురు పక్కనపెట్టేసి మళ్లీ ఫార్చూనర్‌ కారెక్కి వెళ్లిపోయాడు...! ఆ వ్యక్తి పేరు శేషప్పణ్ణ.. బంట్వాళలో పౌర కార్మికుడు..! అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇలాంటివి జరుగుతుంటాయని వింటుంటాం. కానీ.. కర్ణాటకలోనూ ఓ పారిశుధ్య కార్మికుడు ఇలా విసాలవంతమైన కారులో వచ్చి పనిచేసి వెళ్లడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. శేషప్పణ్ణ 1996లో రూ.50ల కూలి కోసం పౌరకార్మికుడిగా చేరాడు. కొంతకాలానికే పర్మినెంట్‌ ఉద్యోగి అయ్యాడు. మూడో తరగతి వరకే చదివిన శేషప్పణ్ణ ఓ దశలో మద్యానికి బానిసయ్యాడు. 2005లో బంట్వాళ ఎస్‌ఐ బెళ్ళియప్ప మాటల స్ఫూర్తితో మద్యం మానేశా డు. రోజూ మధ్యాహ్నం వరకూ పౌరకార్మికుడిగా పనిచేస్తాడు. ఆ తర్వాత పశువుల పెంపకం చూసుకుంటాడు. దీనిద్వారా నెలకు మరో రూ.40వేలు సంపాదిస్తాడు. ఈ క్రమంలో తొలుత ఆల్టో కారు కొన్న అతన్ని కొందరు.. ‘పారిశుధ్య కార్మికుడికి కారు ఎందుకు..?’ అని ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. కొన్నాళ్లకు స్పార్పియో కొన్నాడు. పాత కారును విక్రయించి మళ్లీ లోన్‌ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మారింది. ప్రస్తుతం ఫార్చూనర్‌ కారు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా శేషప్పణ్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. మద్యానికి బానిసై ఎన్నో కోల్పోయాను. తండ్రి అంత్యక్రియలు చేసేందుకూ డబ్బులు లేవు. ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు. గౌరవమే ప్రధానం. కార్మికుడిగా వచ్చే జీతంతో పాటు పశువుల ద్వారా మరో రూ.40వేలు సంపాదిస్తున్నా. నాకిష్టమైన కారులో తిరగడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 06:41 AM