తండ్రి ఘాతుకం.. కొడుకు పోలికలు తనలా లేవని..
ABN , Publish Date - Apr 15 , 2026 | 09:28 PM
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి కన్న కొడుకును చంపేశాడు. 6 సంవత్సరాల బాలుడిని కృష్ణా నదిలో తోసేసి ప్రాణాలు తీశాడు.
బెంగళూరు, ఏప్రిల్ 15: భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి కన్న కొడుకును చంపేశాడు. 6 సంవత్సరాల బాలుడిని కృష్ణా నదిలో తోసేసి ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. విజయపుర జిల్లా, నాగతనకు చెందిన మల్లిఖార్జున అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన భాగ్యశ్రీతో 8 ఏళ్ల క్రితం పెళ్లయింది. దంపతులకు ఆరేళ్ల బాబు ఉన్నాడు. మల్లిఖార్జునకు భార్య మీద అనుమానం మొదలైంది.
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. మల్లిఖార్జునకు స్నేహితులు కూడా తోడయ్యారు. అతడి అనుమానానికి అజ్యం పోశారు. ‘నీ కుమారుడికి నీ పోలీకలు అస్సలు లేవు’ అంటూ ఉండేవారు. దీంతో భార్యపై అతడికి మరింత అనుమానం పెరిగింది. కొడుకు తన సంతానం కాదన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే కొడుకును చంపడానికి నిశ్చయించుకున్నాడు. మార్చి 16వ తేదీన కుమారుడిని ఇంటినుంచి బయటకు తీసుకువెళ్లాడు. కొడుకును రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తున్నానని భార్యతో చెప్పాడు.
బాలుడిని మహారాష్ట్ర సరిహద్దు దగ్గర కృష్ణా నదిలో తోసి చంపేశాడు. తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. ఏప్రిల్ 2వ తేదీన బాలుడి పుట్టినరోజు కావటంతో స్కూలు నుంచి తీసుకురమ్మని భాగ్యశ్రీ భర్తకు చెప్పింది. కొడుకును తీసుకువస్తే ఘనంగా పుట్టిన రోజు వేడుక చేద్దామంది. భార్య కొడుకు గురించి అడిగిన రోజు నుంచి మల్లిఖార్జున కనిపించకుండా పోయాడు. భాగ్యశ్రీకి అనుమానం వచ్చింది. స్కూలు దగ్గరకు వెళ్లి కొడుకు గురించి ఎంక్వైరీ చేసింది. కొడుకు స్కూల్లో లేడని తెలియటంతో పోలీస్ స్టేషన్‌లో కొడుకు, భర్త కనిపించటం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కలబురగి జిల్లాల్లో మల్లిఖార్జునను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. కొడుకును తానే చంపానని ఒప్పుకున్నాడు. పోలీసులు మల్లిఖార్జునను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే.. గల్ఫ్ వాణిజ్యాన్ని స్థంభింపచేస్తాం: ఇరాన్
పోలీసులను ఎలా వాడుకున్నారో గుర్తు లేదా సజ్జల?: ఎమ్మెల్సీ కంచర్ల