Share News

ఆర్మీ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ బురిడీ కొట్టిస్తున్న యువకుడి అరెస్టు

ABN , Publish Date - Jun 13 , 2026 | 10:53 AM

సైనిక అధికారిగా నటిస్తూ జనాల్ని మోసగిస్తున్న ఒక యువకుడి కోసం ఉచ్చు పన్నిన ఆర్మీ అధికారులు తాజాగా అతడిని అరెస్టు చేశారు. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఆర్మీ ఆఫీసర్‌నని చెప్పుకుంటూ బురిడీ కొట్టిస్తున్న యువకుడి అరెస్టు
Fake Army officer arrested in UP

ఇంటర్నెట్ డెస్క్: తాను సైనిక అధికారినని చెప్పుకుంటూ జనాల్ని బురిడీ కొట్టిస్తున్న ఒక 21 ఏళ్ల యువకుడికి ఆర్మీ చెక్‌ పెట్టింది. అతడి కోసం వల పన్ని అరెస్టు చేసింది. యూపీలోని షాజహాన్‌పూర్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆర్యన్ వర్మ అనే యువకుడు నీట్‌ ఎగ్జామ్‌లో పలుమార్లు విఫలమయ్యాడు. ఆ తరువాత ఆర్మీలో బ్రిగేడియర్‌నని చెప్పుకుంటూ తిరగడం ప్రారంభించాడు. అధికారిక కార్యక్రమాల్లో వినియోగించే యూనిఫామ్‌ను ధరించి జనాల్ని బురిడీ కొట్టించేవాడు. జనాల్ని నమ్మించేందుకు ఒక ఎస్‌యూవీ కూడా వాడేవాడు. తన వెంట ఇద్దరు బాడీ గార్డులను తెచ్చుకునే అతడు వారిని ఎన్‌ఎస్‌జీ కమాండోలుగా జనాలను పరిచయం చేస్తుండేవాడు.


ఆర్యన్‌పై ఫిర్యాదులు అందడంతో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. అతడిని అరెస్టు చేసేందుకు ఏప్రిల్‌లో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీ అధికారులు సాధారణ పౌరుల్లా అతడిని సంప్రదించారు. కంటోన్‌మెంట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను ఉద్దేశించి ప్రసంగించాలని అన్నారు. దీంతో, ఆర్యన్ కార్యక్రమానికి ఆర్మీ యూనిఫామ్ ధరించి హాజరయ్యాడు. ఎస్‌యూవీ కారులో, ఇద్దరు బాడీ గార్డులను తీసుకొచ్చాడు. వారిని ఎన్‌ఎస్‌జీ కమాండోలని చెప్పుకున్నాడు. చివరకు ఆర్మీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆర్యన్ వద్ద నుంచి ప్రభుత్వ గుర్తింపు కార్డును పోలినట్టు ఉన్న ఒక ఐడీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూనిఫామ్, ఐడీలను ఎక్కడి నుంచి సమకూర్చుకున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర

నీట్‌ రీఎగ్జామ్‌కు పారామిలిటరీ భద్రత!

Updated Date - Jun 13 , 2026 | 11:08 AM