ఇక విడతలవారీగా పీఎఫ్ విత్‌డ్రా
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:23 AM
విశ్రాంత ఉద్యోగుల భవిష్య జీవిత భద్రతకు భరోసానిస్తూ ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’(ఎస్‌డబ్ల్యూపీ)ను ఉద్యోగుల భవిష్య నిధి(ఈపిఎఫ్ఓ) ఆమోదించింది
రిటైరైన ఉద్యోగులు ఒకే సారి సొమ్ము తీసుకోనక్కర్లేదు
అవసరమైన మొత్తాన్ని వాయిదాల్లో తీసుకోవచ్చు
మిగిలిన సొమ్మును ఖాతాలో ఉంచుకోవచ్చు
కొత్త నిబంధనలతో 6.32 లక్షల మందికి ప్రయోజనం
55 ఏళ్ల లోపు వయసున్న సభ్యులు ఇకపై 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు
న్యూఢిల్లీ, నవంబరు 19: విశ్రాంత ఉద్యోగుల భవిష్య జీవిత భద్రతకు భరోసానిస్తూ ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’(ఎస్‌డబ్ల్యూపీ)ను ఉద్యోగుల భవిష్య నిధి(ఈపిఎఫ్ఓ) ఆమోదించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ్‌స(సీబీటీ) 240వ సమావేశం గురువారం జరిగింది. కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధన పూర్తిగా ఐచ్ఛికం. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల మేరకు ఈపీరుడు పదవీ విరమణ చేసిన తరువాత పీఎఫ్ ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవాలి. దానిని ఎక్కడ? ఎలా? ఇన్వెస్ట్ చేయాలన్న అంశాన్ని ఆ తరువాత ఆలోచించుకోవాలి. సురక్షితమైన పెట్టుబడి మార్గాలను అన్వేషించలేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కొత్త నిబంధనల వల్ల ఆ సమస్యలేదు. ఒకేసారి నగదు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక వాయిదాల రూపంలో తీసుకోవచ్చు. లేదా అవసరమైన మొత్తాన్ని తీసుకొని మిగిలిన దానిని ఖాతాలో ఉంచుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముకు వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే వెసులుబాటూ ఉంది. ఏ పద్ధతిలో నగదు తీసుకుంటామన్నది మన ఇష్టమే. మిగిలిన నగదుకు ఈపీఎ్‌ఫఓ వార్షిక వడ్డీ వస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025-26కు 8.25 వడ్డీని సీబీటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధల వల్ల 55 ఏళ్లు దాటి, ఖాతాలో కనీసం రూ.5 లక్షల నగదు ఉన్న సుమారు 6.32 లక్షల మంది సభ్యులు లాభపడతారని అంచనా. ఒక వేళ సభ్యుడు మరణించినట్లయితే నామినీ... ఖాతాలోని మొత్తాన్ని తీసుకోవడమా లేదా అప్పటికే అమలులో ఉన్న ఎస్‌డబ్ల్యూపీని కొనసాగించడమా అన్నది అవసరానికి అనుగుణంగా నిర్ణయించుకునే అవకాశం ఉంది. సీబీటీ దీనిని ఆమోదించినా ఈ వెసులుబాటు వెంటనే అమలులోకి రాదు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను రూపొందించి, ఈపీఎఫ్ఓ నోటిఫై చేసిన తరువాతే సభ్యులకు ఈ నిబంధన అందుబాటులోకి వస్తుంది.