ఎగిరే కారు.. విన్యాసాలు సూపరు
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:11 AM
ప్రపంచాన్ని అబ్బురపరిచే అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించటంలో అందరికంటే ముందుండే అమెరికా కుబేరుడు ఈలన్ మస్క్.. మరో అద్భుతాన్ని ప్రపంచం ముందుకు తెచ్చారు.
మస్క్ కంపెనీ టెస్లా నుంచి సరికొత్త రేస్ కారు ఆవిష్కరణ
గాల్లో పల్టీలు కొట్టినా.. సురక్షిత ల్యాండింగ్ దీని ప్రత్యేకత
ఒక్క సెకనులోనే 96 కి.మీ. వేగంఅందుకోవడం మరో ప్రత్యేకత
2028లో కార్ల ఉత్పత్తి: మస్క్
సరికొత్త రేస్ కారును ఆవిష్కరించిన ఈలన్ మస్క్ కంపెనీ టెస్లా
టెక్సాస్, అక్టోబరు 16: ప్రపంచాన్ని అబ్బురపరిచే అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించటంలో అందరికంటే ముందుండే అమెరికా కుబేరుడు ఈలన్ మస్క్.. మరో అద్భుతాన్ని ప్రపంచం ముందుకు తెచ్చారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎగిరే కారును గురువారం ఆవిష్కరించారు. అమెరికాలోని టెక్సా్‌సలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఈ కారును పరీక్షించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా.. ఆయనకే చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్తో కలిసి ఈ కారును తయారుచేసింది. ఈ స్పోర్ట్స్ కారుకు రోడ్‌స్టర్ అని పేరు పెట్టారు. ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి. పెర్ఫామెన్స్, థ్రస్ట్, రాకెట్ వేరియింట్లలో ఈ కారు లభిస్తుంది. నిజానికి ఈ కారును తెస్తున్నట్లు 2017లోనే ప్రకటించారు. కానీ, సాంకేతిక అవాంతరాల వల్ల చాలా ఆలస్యమైంది. 2028నుంచిఈ కారు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈలన్ మస్క్ తెలిపారు.
దీని ప్రత్యేకతలు ఏంటి?
ఎగిరే కారు అంటే.. ఇది పూర్తిగా ఆకాశంలో విహరించేది కాదు. అవసరమైనప్పుడు కొద్దిదూరం గాల్లో పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి.. తిరిగి సరక్షితంగా నేలపై దిగగలదు. ఈ కారులోని ఎగిరే సాంకేతికతను స్పేస్ఎక్స్ అందించింది. ఈ కారులో తీవ్రమైన ఒత్తిడిగల కోల్డ్‌ప్రెస్డ్ గ్యాస్‌తో కూడిన ట్యాంకు ఉంటుంది. దానికి అనుసంధానమైన 10 థ్రస్టర్లు కారు చుట్టూ అమర్చబడి ఉంటాయి. వాటిని ఆన్చేసినప్పుడు గ్యాస్ తీవ్రమైన ఒత్తిడితో థ్రస్టర్ల ద్వారా బయటకు వచ్చి, కారును గాల్లోకి లేపుతుంది.

ఈ థ్రస్టర్ల సాయంతోనే కారు గాల్లో తలకిందులుగా తిరుగుతుంది. వాటి సాయంతోనే తిరిగి సాధారణ స్థితికి వచ్చి నేలపై దిగుతుంది. టెక్సాస్ స్పేస్ఎక్స్ ప్రయోగ కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఈ కారును పరీక్షించారు. రోడ్డు ఆకాశంలోకి వెళ్తున్నట్లుగా ఉండి.. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత తిరిగి నేలపైకి వంగినట్లుగా వంపు తిరిగి ఉన్న ఈ వేదిపై రోడ్‌స్టర్ కారు వేగంగా వెళ్లి తలకిందులుగా తిరిగి, ఒక పల్టీ కొట్టి నేలపై సాధారణ స్థితిలో దిగింది. మరో ప్రయోగంలో వరుసగా నిలిపి ఉంచిన టెస్లా కార్లపై నుంచి హైజంప్ చేస్తున్నట్లుగా ఈ కారు పైకి ఎగిరి గాల్లోనే పల్టీ కొట్టి అవతలివైపు తిరిగి సాధారణ స్థితిలో దిగింది.
పెర్ఫామెన్స్ వర్షన్: ఇది సాధారణంగా రోడ్డుపై పరుగెత్తే స్పోర్ట్స్ సూపర్ కారు. ఇందులో అద్భుతమైన గ్రిప్ కోసం యాక్టివ్ ఏరో డైనమిక్స్తోపాటు కారు కిందిభాగంలో గాలిని పీల్చుకోగల మల్టీమోడ్ సక్షన్ ఫ్యాన్ సిస్టమ్ ఉంటుంది. ఇది 1.6 సెకన్లలో 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
థ్రస్ట్ వర్షన్: ఈ కారు ఇంధనానికి బదులుగా పవర్ కోసం కోల్డ్ ప్రెస్డ్ గ్యాస్‌ను వాడుకుంటుంది. తీవ్రమైన ఒత్తిడి ఉండే ట్యాంకుల నుంచి వచ్చే గాలిని ఇందులోని థ్రస్టర్లు శక్తిగా మార్చి కారుకు అందిస్తాయి. రేసుల కోసమే దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
రాకెట్ వర్షన్: గురువారం పరీక్షించిన వర్షన్ ఇదే. ఈ కారులోని 10 థ్రస్టర్లు దీనిని కొద్దిసేపు గాల్లో ఎగిరేలా చేయగలవు. ఈ కారును అందరికీ విక్రయించరు. టెస్లా కంపెనీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుకున్నవారికి మాత్రమే ఈ కార్లు లభిస్తాయి. ఇందులో డ్రైవర్ సీటు మాత్రమే ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇక సహించేది లేదు.. రష్యా చమురు శుద్ధి కేంద్రంపై ఉక్రెయిన్ దాడి..
యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల క్షిపణి దాడి.. ఐదుగురి మృతి, 16 మందికి గాయాలు