కొత్త చరిత్రా..?పాత ఫలితమా?
ABN , Publish Date - May 04 , 2026 | 03:56 AM
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలవడనున్నాయి. అంతకుముందే ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన పేరు వెనుక సీఎం అనే పదాన్ని తొలగించుకున్నారు..
నేడే నాలుగు రాష్ట్రాలు.. పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు
పటిష్ఠ ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
బెంగాల్‌లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
అక్కడ బీజేపీ గెలిస్తే సరికొత్త చరిత్రే
తమిళనాడులో రిసార్టు రాజకీయాలు మొదలు
గెలిచే అభ్యర్థులను కాపాడుకొనే పనిలో విజయ్
మళ్లీ ఎల్డీఎఫ్ గెలిస్తే కేరళలో సరికొత్త రికార్డు
అస్సాంలో తేలనున్న 722 మంది అభ్యర్థుల భవిత
న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలవడనున్నాయి. అంతకుముందే ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన పేరు వెనుక సీఎం అనే పదాన్ని తొలగించుకున్నారు.. తమిళనాడులో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందే రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి రాష్ట్రంలో హంగ్ వస్తుందని.. తానే కింగ్ మేకర్ అవుతానన్న ధీమాతో ఉన్న టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్, తన ఎమ్మెల్యేలందరిని రిసార్టుకు తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు. టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా -నేనా అన్నట్లుగా పోటీ ఉన్న బెంగాల్‌లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం మమతాబెనర్జీ సిద్ధమయ్యారు. ఆదివారమే తన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు ఆ మేరకు దిశా నిర్దేశం చేశారు. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎగ్జిట్‌పోల్ సర్వేలు భిన్న ఫలితాలను అంచనా వేయటంతో పోటీచేసిన రాజకీయ పార్టీల్లో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈసీ చర్యలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా అడ్డుకోవడానికి తొలిసారి క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది.
బెంగాల్‌పైనే అందరి దృష్టి
తాజా ఎన్నికల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పైనే నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలుండగా, నేడు 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. ఫాల్టా నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈసీ రద్దుచేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత మూడు ఎన్నికల్లో తిరుగులేని విజ యం సాధించిన టీఎంసీ నాలుగోసారి విజయంపై ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్‌లో పాగా వేయాలని శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ కూడా తనదే విజయం అని చెప్పుకుంటోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎక్కువశాతం మాత్రం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే, తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమత ప్రకటించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఫలితంపైఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి నిలబడ్డారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆయన మమతను ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుందా? మమత పైచేయి సాధిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. బెంగాల్‌లో గత నెల 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా 92.47శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ఓట్ల లెక్కింపు కోసం దాదాపు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలను నియమించారు.
ద్రావిడ గడ్డపై ‘దళపతి’పై ఏం చేసేనో..!
ఎప్పుడూ ద్విముఖ పోరు జరిగే తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలే శాసిస్తుండగా.. వీటి మధ్యలోకి ఈసారి‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో సినీనటుడు విజయ్ ప్రవేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా.. 85.10శాతం పోలింగ్ నమొదైంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకేదే ఈసారి కూడా అధికారమని మె జారిటీ ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రకటించాయి. ‘యాక్సిస్ మై ఇండియా’ మాత్రం విజయ్ పార్టీ ఏకంగా 120 వరకు సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. దీంతో ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ఆశతో ఉంది. ఒకవేళ విజయ్ పార్టీ గెలిస్తే తమిళనాడులో సరికొత్త రాజకీయ శకం మొదలైనట్లే. కాగా, రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశముందన్న అంచనాలతో దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. గెలిచేవారంతా వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపో ర్టు చేయాలని ఆదేశించారు. వారిని ఓ రిసార్టుకు తరలించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.
సీఎం పేరు తీసేసిన విజయన్
కేరళలో పోలింగ్‌కు ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. వామపక్ష కూటమి ఎల్డీఎ్‌ఫను వరుసగా రెండుసార్లు గెలిపించి చరిత్ర సృష్టించినసీఎం పినరయ్ విజయన్.. తనకు తానుగా సీఎం పేరును వదిలేసుకొని సంచలనం సృష్టించారు. తన సోషల్‌మీడియా ఖాతాలో ఆదివారం ఆయన కేరళ ముఖ్యమంత్రి అనే పదాన్ని తొలగించి సీపీఐఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు అనే పదాలను చేర్చారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి గెలుపు ఖాయమని ఎక్కువ శాతం ఎగ్జిట్‌పోల్ సర్వేలు ప్రకటించాయి.
అస్సాంలో అధికారంపై కమల దళం ధీమా
అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకోవటంపై బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్‌పోల్ సర్వేలు కూడా మళ్లీ బీజేపీదే అధికారమని ప్రకటించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తోంది. 126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. 2.50 కోట్ల ఓటర్లున్న ఇక్కడ.. 85.96 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 722 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ‘ఏఐఎన్‌ఆర్‌సీ - బీజేపీ’ కూటమిదే మళ్లీ అధికారమని సర్వేలు తెలిపాయి. కాంగ్రెస్ - డీఎంకే కూటమి కూడా గెలుపుపై ధీమాగానే ఉంది.