Share News

రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాల సాఫ్ట్‌కాపీలు!

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:39 AM

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ రద్దు డిమాండ్లతో సీజేపీ, ప్రతిపక్ష ఇండి కూటమి ఆందోళనలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాజకీయ పార్టీలకు  ఓటర్ల జాబితాల సాఫ్ట్‌కాపీలు!
gyaneshkumar

  • చదవగలిగే, శోధించే వీలుండే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అందజేయాలని ఈసీ నిర్ణయం

  • ‘సర్‌’ పూర్తయిన 17 రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ‘ఎస్‌ఎస్ఆర్‌’

న్యూఢిల్లీ, అక్టోబరు 16: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా, ‘సర్‌’ ప్రక్రియ రద్దు డిమాండ్లతో సీజేపీ, ప్రతిపక్ష ఇండి కూటమి ఆందోళనలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజకీయ పార్టీలు కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నట్టుగా.. చదవగలిగే, శోధించగలిగే(రీడబుల్‌, సెర్చబుల్‌)లా ఓటర్ల జాబితాల సాఫ్ట్‌కాపీలను అందించేందుకు సిద్ధమైంది. మరోవైపు ‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన 17 రాష్ట్రాల్లో కొత్తగా ఓటర్ల నమోదు కోసం విస్తృత స్థాయిలో ‘ప్రత్యేక సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎ్‌సఆర్‌)ను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం స్కాన్‌ చేసిన చిత్రాల రూపంలో ఉన్న పీడీఎఫ్‌ ఫైళ్లను మాత్రమే రాజకీయ పార్టీలకు అందించేది. అందులో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను నేరుగా శోధించడం, ఎంపిక చేసుకోవడం, కాపీ చేసుకోవడం కుదిరేది కాదు. అర్హుల ఓట్ల తొలగింపు, నకిలీ ఓటర్లు, ఒకటికి మించి ఓట్లు ఉండటం తదితర అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఓటర్ల జాబితా ముసాయిదా, తుది ఓటర్ల జాబితాలను.. పేర్లు, ఇతర వివరాలను సులువుగా వెతకగలిగే (రీడబుల్‌) పీడీఎఫ్‌, వర్డ్‌ ఫైల్‌ వంటి సాఫ్ట్‌కాపీలు ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఎన్నాళ్లుగానో కోరుతున్నాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం ససేమిరా అంటూ వచ్చింది. 2018లో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ఓటర్ల జాబితాల సాఫ్ట్‌కాపీలు ఇచ్చేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఓటర్ల వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం కలుగుతుందని, డేటాను అనుచితంగా సేకరించి వినియోగించే ప్రమాదం ఉందని వాదించింది.


అప్పట్లో ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఓటర్ల జాబితాలను ఏ రూపంలో ప్రచురించాలన్నది ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. అయినా ప్రతిపక్షాల డిమాండ్లు ఆగలేదు. 2025లో రాహుల్‌ గాంధీ ‘ఓటు చోరీ’ ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. ఓటర్ల జాబితాలను కేవలం చిత్రాల రూపంలో అందించడం వల్ల ఒకే పేరుతో ఉన్న ఓటర్లను, నకిలీలను, డూప్లికేట్‌ ఓట్లను గుర్తించడం కష్టమవుతోందని స్పష్టం చేశారు. తర్వాత ప్రతిపక్ష ఇండి కూటమి పక్షాలు కూడా ఈ డిమాండ్‌ను గట్టిగా లేవనెత్తాయి. తాజాగా సీజేపీ, ఇండి కూటమి ఆందోళనలతో ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది.

‘సర్‌’తో కొత్త ఓటర్ల నమోదుకు తిప్పలు

2025 ఫిబ్రవరిలో సర్‌ ప్రక్రియ చేపట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో సాధారణంగా ఏటా చేపట్టే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. ఓటర్ల నమోదు అంతా ‘సర్‌’కు అనుబంధంగా మార్చిన ఫారం-6 ఆధారంగానే చేపట్టారు. అంటే కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే యువత.. వివిధ రకాల ధ్రువపత్రాలను చూపి, 2002 నాటి ‘సర్‌’ జాబితాలోని తమ తల్లిదండ్రుల వివరాలు ఇచ్చి, మ్యాపింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన 17 రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను చేపడతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ‘ప్రత్యేక జాబితాల సవరణ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ - ఎస్‌ఎస్ఆర్‌)’ను చేపట్టింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో నిరసనలతో రూ.2వేల కోట్ల వ్యాపార నష్టం? ప్రధాని మోదీకి వర్తక సంఘాల లేఖ

ఢిల్లీలో సీజేపీ నేతల అరెస్టుతో ఉద్రిక్తత.. కన్నాట్ ప్లేస్‌లో జాతీయ జెండా ఎగురవేతకు పిలుపు

Updated Date - Oct 17 , 2026 | 04:39 AM