Share News

ఈ-20తో వాహనాలకు పెద్దగా సమస్యల్లేవ్‌!

ABN , Publish Date - Jul 30 , 2026 | 05:43 AM

ఈ-20 పెట్రోల్‌ వాడటం వల్ల వాహనాల పనితీరు, మన్నికలో గణనీయమైన సమస్యలు ఏమీ ఉత్పన్నం కావని సమగ్ర అధ్యయనాల్లో గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాత తరం వాహనాల్లో సైతం...

ఈ-20తో వాహనాలకు పెద్దగా సమస్యల్లేవ్‌!

  • పాత బళ్లలోనూ ఇంజిన్‌ మార్చకుండానే వాడుకోవచ్చు

  • సమగ్ర అధ్యయనాల తర్వాతే చెబుతున్నాం: నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ, జూలై 29: ఈ-20 పెట్రోల్‌ వాడటం వల్ల వాహనాల పనితీరు, మన్నికలో గణనీయమైన సమస్యలు ఏమీ ఉత్పన్నం కావని సమగ్ర అధ్యయనాల్లో గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాత తరం వాహనాల్లో సైతం ఇంజిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే ఈ-20 పెట్రోల్‌ వాడుకోవచ్చని నొక్కి చెప్పింది. ఈ-20 పెట్రోల్‌పై సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనలకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ-20 వల్ల వాహనం నడపడంలోగానీ, స్టార్ట్‌ చేయడంలోగానీ ఇబ్బందులు రావని, వాహనంలోని లోహ, ప్లాస్టిక్‌ భాగాలకు సైతం నష్టం కలగదని అధ్యయనాల్లో తేలినట్టు చెప్పారు. మైలేజీ అనేది ఎలాంటి ఇంధనం అనేదానిపైనే కాకుండా అనేక ఇతర కారణాలపైనా ఆధారపడి ఉంటుందని ఆటోమొబైల్‌ తయారీదారులు, వాహనాల టెస్టింగ్‌ ఏజెన్సీలు స్పష్టం చేసినట్టు గడ్కరీ వివరించారు. ఐవోసీఎల్‌(ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌), ఐఐపీ(ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం), ఎస్‌ఐఏఎం(భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం-డెహ్రాడూన్‌), ఏఆర్‌ఏఐ(ఆటోమోటివ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) సంయుక్తంగా అధ్యయనం నిర్వహించి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఈ-20 పెట్రోల్‌ వాడటం వల్ల నష్టంలేదని నిర్ధారించినట్టు తెలిపారు. అయితే, 2005 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రవేశపెట్టిన, 2016కు ముందు తయారైన బీఎస్‌-3 వాహనాలకు మాత్రం రబ్బరుతో తయారైన కొన్ని విడిభాగాలు, గాస్కెట్లు మార్చాల్సిన అవసరం ఏర్పడొచ్చని, వాహనాల రొటీన్‌ సర్వీసింగ్‌లోనే చాలా సులభంగానే వాటిని మార్చివేయొచ్చని గడ్కరీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్

ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్

Updated Date - Jul 30 , 2026 | 05:43 AM