Share News

కేతన్ మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. కాబోయే భర్తను లోయలోకి తోసేసి..

ABN , Publish Date - Jun 23 , 2026 | 06:09 PM

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీలు కలిసే కేతన్‌ను లోయలోకి తోసేసినట్లు పోలీసులు తేల్చారు.

కేతన్ మర్డర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు.. కాబోయే భర్తను లోయలోకి తోసేసి..
Lohagad Fort

ముంబై, జూన్ 23: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీలు కలిసే కేతన్‌ను లోయలోకి తోసేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నాతాధికారులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.


నమ్మించి తీసుకెళ్లి..

కేతన్ అగర్వాల్‌కు సియా గోయల్ అనే అమ్మాయితో కొన్ని రోజుల క్రితం పెళ్లి నిశ్చయం అయింది. నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. గురువారం సియా పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా సియ, కేతన్ లోనావాలాకు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. లోహగడ్‌ కోటకు వెళుతుండగా కేతన్ లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కేతన్ లోయలో పడిపోయాడని సియా పోలీసులకు చెప్పింది. 3 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత లోయలో కేతన్ శవాన్ని కనుగొన్నారు.


పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లోనావాలా రూరల్ పోలీసులు సియాను విచారించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పటం మొదలెట్టింది. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం వచ్చింది. మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్ సేకరించటంతో పాటు సంఘటనా స్థలంలో ఉన్న జనాలను విచారించారు. దీంతో ఆమెపై అనుమానం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే సియాను, ఆమెను ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీలు పక్కా ప్లాన్‌తో కేతన్‌ను మర్డర్ చేసినట్లు తేలింది. ఇద్దరూ కలిసి కేతన్‌ను లోయలో తోసేశారని వెల్లడైంది. ఈ మర్డర్ ఇద్దరే చేశారా? లేక వారికి ఎవరైనా సహకరించారా? అన్న కోణంలో కూడా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


హత్యకు కారణం ఇదే..

పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. కేతన్‌ను పెళ్లి చేసుకోవటం సియాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె చేతన్ చౌదరీని ప్రేమిస్తోంది. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో కలిసి పని చేస్తున్నారు. ప్రియుడి సాయంతో కేతన్ అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పక్కా ప్లాన్ వేసుకున్నారు. సియా తన పుట్టిన రోజున కేతన్‌ను లోహగడ్‌కు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లింది. సరైన సమయం దొరకగానే తన ప్రియుడు చేతన్ సాయంతో కేతన్‌ను లోయలోకి తోసేసింది. కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. దర్యాప్తులో ఆమె చేసిన నేరం బయటపడింది.


ప్యాలెస్ కోసం రూ. 17 కోట్లు..

కొడుకు పెళ్లి కోసం విశాల్ అగర్వాల్ ఇప్పటికే 20 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి నవంబర్ నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగాల్సి ఉంది. విశాల్ 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి కోసం ఇప్పటికే ప్యాలెస్ బుక్ చేశాడు. అంతేకాదు.. బంధుమిత్రులను, అతిథులను తరలించడానికి విమానాలను కూడా బుక్ చేశాడు. పెళ్లికి ఇంకా ఐదు నెలలు ఉన్నా కూడా ఇప్పటినుంచే రెండు కుటుంబాల వారు పెళ్లి పనులు మొదలెట్టారు. సియా చేసిన దారుణం కారణంగా రెండు కుటుంబాల వారు షాక్‌లో ఉన్నారు.


ఇవి కూడా చదవండి

మేము లేకుండా యూఎస్ చంద్రుణ్ణి చేరుకోలేదు: జర్మనీ మంత్రి

కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

Updated Date - Jun 23 , 2026 | 06:15 PM