మూడేళ్ల తర్వాత రిలీజ్.. రెండు రోజుల్లోనే ఊహించని షాక్..
ABN , Publish Date - Jul 06 , 2026 | 07:43 AM
దిల్‌జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమా జులై 3వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సినిమాకు ఊహించని షాక్ తగిలింది. భారతదేశంలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ జీ5 నిర్ణయం తీసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ పంజాబీ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన 'సత్లుజ్' సినిమా జులై 3వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సినిమాకు ఊహించని షాక్ తగిలింది. భారతదేశంలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ జీ5 నిర్ణయం తీసుకుంది. సినిమా ప్రదర్శనను నిలిపివేయడానికి గల సరైన కారణాలు జీ5 వెల్లడించలేదు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో.. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. చట్టపరమైన ప్రక్రియల ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాము’ అని పేర్కొంది.
రాజకీయ దుమారం..
సత్లుజ్ సినిమా ప్రదర్శనను నిలిపివేయటాన్ని పంజాబ్‌లోని శిరోమణి అకాలీ దళ్ (SAD), శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) తీవ్రంగా తప్పుపట్టాయి. అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘భారతదేశంలో జీ5 నుంచి సత్లుజ్ సినిమాను అకస్మాత్తుగా తొలగించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధగా ఉంది. బాధాకరమైన పంజాబ్ చరిత్రను ధైర్యంగా ఆవిష్కరిస్తూ, సర్దార్ జస్వంత్ సింగ్ జీ ఖల్రా చేసిన అత్యున్నత త్యాగాన్ని గౌరవించే ఒక శక్తిమంతమైన చిత్రాన్ని ఈ విధంగా అణచివేయలేరు. ఇది నిజం, భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి. నేను ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’అని పేర్కొన్నారు.
మూడేళ్ల తర్వాత రిలీజ్..
సత్లుజ్ సినిమా పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. పంజాబ్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్లు, అక్రమ శవదహనాల వంటి సున్నితమైన నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ సినిమా తీశారు. 'పంజాబ్ 95' అనే పేరుతో విడుదలకు సిద్ధం చేయగా.. సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ కారణంగా సినిమా విడుదల మూడేళ్లు ఆగిపోయింది. బోర్డు ఈ సినిమాకు ఏకంగా 127 కట్స్ సూచించిందని చిత్ర బృందం ఆరోపించింది. మూడేళ్ల తర్వాత పేరు మార్చుకుని జులై 3వ తేదీన జీ5 ఓటీటీలో విడుదలైంది. ఊహించని విధంగా రెండు రోజుల్లోనే భారత్‌లో సినిమా ప్రదర్శన ఆగిపోవటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి?
ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్