ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. 30 ఏళ్ల నాటి హిస్టరీ రిపీట్!
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:58 PM
బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో హిస్టరీ రిపీట్ అయ్యింది. విద్యార్థి ఉద్యమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత అవే విద్యార్థి నిరసనలతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: స్టూడెంట్ లీడర్‌గా కెరీర్ ప్రారంభించి జాతీయ స్థాయి నేతగా ఎదిగిన బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ నేడు అవే విద్యార్థి నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదివికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 30 ఏళ్ల తరువాత చరిత్ర ఊహించని విధంగా పునరావృతం కావడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది..
30 ఏళ్ల క్రితం లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి..
అది 1997 సంవత్సరం. అప్పట్లో ఒడిశాలో 12వ తరగతి బోర్డు పరీక్షలను ‘ప్లస్ 2’ అని పిలిచేవారు. ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ కావడంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ప్రభుత్వ అసమర్థతకు వ్యతిరేకంగా విద్యార్థిలోకం గళమెత్తింది. ఏకంగా సెక్రటేరియట్ ఎదుట 1500 మంది విద్యార్థులు నిరసనకు దిగారు. వారిని ముందుండి నడిపించిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. అప్పట్లో ఆయన ఏబీవీపీ నేతగా ప్రభుత్వ తీరును ఖండించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసినా లెక్కచేయలేదు. పలు ఫ్రాక్చర్లు అయినా ఆయన ఆత్మస్థైర్యం సడలలేదు.
ఇంతటి స్థాయిలో విద్యార్థుల ఆగ్రహం కట్టలుతెంచుకోవడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ప్లస్ 2 బోర్డు నాయకత్వాన్ని మొత్తం తొలగించింది. సంస్కరణల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ తరువాత మరోసారి ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్ష జరిగింది. దీంతో, విద్యార్థులు తమ నిరసనను విరమించారు. ఇక స్టూడెంట్స్‌కు నాయకత్వం వహించిన ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆ తరువాత రాజకీయంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.
ఇది జరిగిన దాదాపు 30 ఏళ్ల తరువాత దేశంలో మళ్లీ అవే సీన్స్ రిపీట్ అయ్యాయి. ఈసారి నీట్ పేపర్ లీకేజీకి కూడా ప్లస్ 2 విద్యార్థులే బాధితులుగా మిగిలారు. ప్రభుత్వం మళ్లీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత పరీక్షలను రద్దు చేసి మరోసారి రీనీట్ నిర్వహించింది. ఈసారి మాత్రం విషయం అక్కడితో ముగిసిపోలేదు. న్యాయం కోసం జెన్ జీ రంగంలోకి దిగింది. తమదైన స్టైల్‌లో నిరసనలతో హోరెత్తించింది. నెల రోజుల పాటు కదం తొక్కింది. చివరకు మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థుల ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇది ఎవరికీ ఓటమి కాదు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ కామెంట్
ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ