Share News

16వ సారి పెరోల్.. జైలు నుంచి విడుదలైన డేరా బాబా..

ABN , Publish Date - May 26 , 2026 | 11:30 AM

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)కు మరోసారి పెరోల్ మంజూరైంది. డేరా బాబాకు ఈసారి 30 రోజుల పాటు పెరోల్ లభించింది. 2017లో అత్యాచారం కేసులో దోషిగా తేలినప్పటి నుంచి ఇది ఆయనకి 16వ పెరోల్.

16వ సారి పెరోల్.. జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
Gurmeet Ram Rahim Singh

హర్యానా: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)కు మరోసారి పెరోల్ మంజూరైంది. డేరా బాబాకు ఈసారి 30 రోజుల పాటు పెరోల్ లభించింది. 2017లో అత్యాచారం కేసులో దోషిగా తేలినప్పటి నుంచి ఇది ఆయనకి 16వ పెరోల్. ఈ రోజు (మంగళవారం) ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి డేరా బాబా రిలీజ్ అయ్యారు. జైలు నుంచి నేరుగా సిర్సాలోని తన డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.


ఈ ఏడాది జనవరిలోనూ డేరా బాబా 40 రోజుల పాటు పెరోల్‌పై విడుదలయ్యారు. ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో ఆయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. 2017 ఆగస్టులో ఆయనను దోషిగా తేల్చి, 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష ఖరారైన దగ్గరి నుంచి డేరా బాబా 16 సార్లు పెరోల్, ఫర్లోపై జైలు నుంచి విడుదలయ్యారు. 2020 అక్టోబర్ నెలలో ఒక రోజు పాటు పెరోల్‌పై బయటకు వచ్చారు. 2021 మే నెలలో మరొక రోజు విడుదలయ్యారు. 2022లో ఏకంగా మూడు సార్లు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ ఏడాది ఫిబ్రవరి, జూన్‌, అక్టోబర్‌లో డేరా బాబా రిలీజ్ అయ్యారు.


2023లోనూ డేరా బాబా మూడు సార్లు జైలు నుంచి విడుదలయ్యారు. జనవరి, జులై, నవంబర్‌ నెలల్లో కోర్టు ఆయనకి పెరోల్ ఇచ్చింది. 2024 జనవరి, ఆగస్టు, అక్టోబర్‌లోనూ పెరోల్ లభించింది. 2025 జనవరి ఏప్రిల్‌, ఆగస్టు నెలల్లో జైలు నుంచి మరోసారి రిలీజ్ అయ్యారు. ఇక, 2026 జనవరిలో కోర్టు ఆయనకు పెరోల్ ఇవ్వగా.. తాజాగా మరో 30 రోజుల పాటు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు..

డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..

Updated Date - May 26 , 2026 | 11:57 AM