మళ్లీ తెరపైకి పునర్విభజన!
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:39 AM
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్ చేయకపోవడం) వెనుక పెద్ద వ్యూహామే ఉందనే చర్చ నడుస్తోంది.
వర్షాకాల సమావేశాలు ప్రొరోగ్ కాలేదు.. మళ్లీ సమావేశాలు జరపటం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్ చేయకపోవడం) వెనుక పెద్ద వ్యూహామే ఉందనే చర్చ నడుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. మరోవైపు, డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లను పెంచవద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గురువారం ఒక లేఖ రాశారు. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీలలో జరిగిన వరుస ఫిరాయింపుల నేపథ్యంలో, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ, డీలిమిటేషన్ బిల్లు కోసం కసరత్తును కేంద్రం ఆపలేదని, పూర్తి మెజారిటీని సాధించేందుకు పావులు కదుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిరెణ్ రిజిజు వ్యాఖ్యలు, మోదీకి ఖర్గే లేఖ రాయడం.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
సమావేశాలు ప్రొరోగ్ కాలేదు
ఓ ఇంటర్వ్యూలో మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ.. పార్లమెంట్‌ను మళ్లీ సమావేశపరిచే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయే తప్ప, అధికారికంగా ప్రొరోగ్ కాలేదని ఆయన గుర్తుచేశారు. ‘హౌస్‌ను ప్రొరోగ్ చేయనప్పుడు, సమావేశాల్ని మళ్లీ జరపటం పెద్ద కష్టమేమీ కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని తెలిపారు. ప్రత్యేక సమావేశాల నిర్వహణపై నేరుగా స్పందించనప్పటికీ.. 1952 నుంచి మన దేశ పార్లమెంటు చరిత్రలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన పేర్కొనటం గమనార్హం. గత ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ రాక వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను మళ్లీ ఇదే సెషన్‌లో ముందుకు తెస్తారనే ప్రచారం జరుగుతోంది.
లోక్‌సభ స్థానాలను స్తంభింపజేయాలి
వచ్చే 25 ఏళ్ల వరకు లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచవద్దని, రాష్ట్రాల వారీగా ప్రస్తుత ప్రాతినిధ్యాన్నే కొనసాగించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. ‘నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని గత నెల 16నే మీకు (ప్రధానికి) లేఖ రాశాను. మీరు భావిస్తున్నట్లుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లులను ప్రవేశపెట్టాలనుకుంటే.. మొదట ఆ ప్రతిపాదనలను కూలంకషంగా అధ్యయనం చేయడానికి పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలి.
బుధవారం రాత్రి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా ఇందుకే ఆపినట్లుగా కనిపిస్తోంది. దీంతో మా వినతిని పునరుద్ఘాటిస్తూ మీకు మళ్లీ లేఖ రాస్తున్నాను’ అని ఖర్గే తెలిపారు. డీలిమిటేషన్ అనేది దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ఇంతటి ముఖ్యమైన విషయం మీద.. ప్రతిపక్షాలను ఈ ఏడాది ఏప్రిల్ 16, 17 తేదీల్లో (ప్రత్యేక సమావేశాల్లో) మాదిరిగా బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేయవద్దన్నారు. అన్ని రాజకీయపార్టీలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ముందుకెళ్లొద్దన్నారు. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 సంఖ్యా బలాన్ని, రాష్ట్రాల వారీగా ఉన్న సీట్ల కేటాయింపును మరో 25 ఏళ్లపాటు అలాగే కొనసాగించాలని పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశ పెట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
నేపాల్ వరదలు.. 359కి చేరిన మృతుల సంఖ్య..
న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో చిన్నారులకు 100 బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి పంపిణీ