ప్రతి రాష్ట్రానికీ 50శాతం పెంపు కోసం బిల్లుకు సవరణ?
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:27 AM
లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పునర్విభజన బిల్లులో ఆ ఊసే లేదు
‘లోక్‌సభలో ప్రస్తుత ప్రాతినిధ్య శాతం తగ్గకుండా’
ఈ వాక్యాన్ని చేర్చడం ద్వారా అధిగమించే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్ర జ్యోతి): లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టిన బిల్లులో జనాభా ప్రాతిపదికనే లోక్‌సభ స్థానాలపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొనిమధ్యేమార్గంగా ప్రతీ రాష్ట్రానికీ ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలకు అదనంగా 50 శాతం పెంచుతామని బీజేపీ అగ్రనాయకత్వం లీకులిచ్చింది. అయితే ఈ అంశాన్ని బిల్లులో పెట్టలేదు. ఇప్పుడున్న వాటికి 50 శాతం పెంచాలనే ప్రొరేటా పద్దతినే రేవంత్‌రెడ్డి, స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ప్రస్తుత బిల్లులో అది కూడా పెట్టలేదు. సభలో మాత్రం అందరికీ యాభై శాతం పెరుగుతాయని అటు ప్రధాని మోదీ ఇటు హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. ఆ మేరకు బిల్లులో మార్పులు జరుగుతాయని, 50 శాతం సీట్ల పెంపు ఉంటుందని బీజేపీ ఎంపీలు నమ్మకంగా చెబుతున్నారు. ప్రతీ రాష్ట్రానికీ 50 శాతం అని ప్రస్తావించకుండా ఏ రాష్ట్రానికీ లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరుగుతుందని ఒక వాక్యం చేర్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం సీట్లు ఎంతవరకు పెంచవచ్చో ఇప్పటికే నిర్ణయిస్తూ బిల్లులో చేర్చారు. ప్రస్తుత ప్రాతినిథ్య శాతం తగ్గకుండా వాటిని సర్దుబాటు చేసే బాధ్యత డీలిమిటేషన్ కమిషన్ తీసుకుంటుంది. బిల్లులో పెట్టకున్నా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాక కమిషన్‌కు ఇచ్చే మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని చేర్చవచ్చని కొందరు అంటున్నా అలా చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని, రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికనే లోక్‌సభ సీట్ల సంఖ్య నిర్ణయించాలని చెబుతున్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన అనే అంశాన్ని సవరణ చేయాలంటే పార్లమెంట్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు అవసరమైన సవరణలు జరిగే అవకాశం ఉంది.