Share News

ఢిల్లీ దిగ్బంధం

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:41 AM

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తలపెట్టిన ఆందోళనతో ఢిల్లీలో తీవ్ర ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. ఇటు సీజేపీ ఆందోళన, అటు ప్రతిపక్ష ఇండి కూటమి నిరసనల నేపథ్యంలో.. పోలీసు యంత్రాంగం నగరంలో కీలక ప్రాంతాలను దిగ్బంధించింది.

ఢిల్లీ దిగ్బంధం
paramilitary forces

bc2.jpg

  • సీజేపీ ఆందోళన నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలు

  • జంతర్‌మంతర్‌ పరిసరాల్లో జనం గుమిగూడటంపై నిషేధం

  • చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ నిలిపివేత

  • 57 మెట్రోస్టేషన్ల మూత.. ఢిల్లీకి వచ్చి, వెళ్లే 245 రైళ్లు రద్దు

  • 35వేల మంది పోలీసు, పారామిలటరీ బలగాల మోహరింపు

  • ముఖ గుర్తింపు వ్యవస్థలు, డ్రోన్లతో నిఘా

  • శుక్రవారం రాత్రి నుంచే ఢిల్లీ శివార్లలో తనిఖీలు

  • వాహనాలు ఇవ్వవద్దని ట్రావెల్స్‌ సంస్థలకు ఆదేశాలు

జంతర్‌మంతర్‌ 2.0కు రంగం సిద్ధమైంది. సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సీజేపీ నేటి నుంచి నిరసనకు శ్రీకారం చుట్టనుండగా, అనుమతి లేదంటూ ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 35 వేల మంది భద్రతా సిబ్బంది మోహరింపు, అడుగడుగునా ఆంక్షలతో ఢిల్లీని దిగ్బంధించింది. ప్రజల దైనందిన జీవితాన్ని స్తంభింపజేయడం సరికాదంటూ ప్రభుత్వానికి చురకలు అంటించిన సుప్రీంకోర్టు, పోలీసుల దూకుడును దుయ్యబట్టింది. ఇదేసమయంలో ఇండి కూటమి నేతలు రాష్ట్రపతి ముర్మును కలిసి ఎన్నికల వ్యవస్థలోఅక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది. వరస పరిణామాలతో ఢిల్లీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.

న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) తలపెట్టిన ఆందోళనతో ఢిల్లీలో తీవ్ర ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. ఇటు సీజేపీ ఆందోళన, అటు ప్రతిపక్ష ఇండి కూటమి నిరసనల నేపథ్యంలో.. పోలీసు యంత్రాంగం నగరంలో కీలక ప్రాంతాలను దిగ్బంధించింది. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించింది. 35వేల మందికిపైగా పోలీసు, సాయుధ బలగాలు, ప్రత్యేక మహిళా బలగాలతో భద్రతా వలయాన్ని సిద్ధం చేసింది. 57మెట్రోస్టేషన్లను మూసివేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కీలక రైల్వేస్టేషన్లకు దూరప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను రద్దు చేసింది. జంతర్‌మంతర్‌ పరిసర ప్రాంతాల్లో జనం గుమిగూడకుండా నిషేధం విధించింది. 4కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నిరసనకారులను అడ్డుకుని, నిర్బంధించేందుకు శుక్రవారం రాత్రి నుంచే ఢిల్లీ శివార్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టింది. మరోవైపు తాము శాంతియుతంగా నిరసన తెలిపి తీరుతామని సీజేపీ ప్రకటించింది. మెట్రోస్టేషన్ల మూసివేత, దిగ్బంధం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కూడా.. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

అనుమతి ఇవ్వలేం.. గుమిగూడితే చర్యలే..

శనివారం జంతర్‌మంతర్‌ వద్ద తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు శుక్రవారం అనుమతి నిరాకరించారు. పది రోజుల ముందే నోటీసు ఇవ్వాల్సి ఉండగా, ఆలస్యంగా ఇచ్చారని, దీనితో సీజేపీ కో-కన్వీనర్‌ సౌరవ్‌దాస్‌ సమర్పించిన దరఖాస్తును తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. గత నిరసన ప్రదర్శనల్లో చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో అనుమతి ఇవ్వడం కష్టమని కూడా పేర్కొన్నారు. భారతీయ శిక్షా స్మృతి సెక్షన్‌ 163 (గతంలో సెక్షన్‌ 144) కింద న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున గుమిగూడడం, ధర్నాలు చేపట్టడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. జనం ఏ రకంగా గుమిగూడినా చట్టవ్యతిరేకమేనని ఢిల్లీ డీసీపీ పేర్కొన్నారు.

భారీ స్థాయిలో భద్రతా సిబ్బంది

నిరసనకారులను అడ్డుకునేందుకు భారీస్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీని 20 జోన్లుగా విభజించి ఏ జోన్‌కు ఆ జోన్‌లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. 37 చోట్ల ప్రదర్శనకారులు ముందుకు సాగకుండా నిలువెత్తు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముఖ గుర్తింపు వ్యవస్థలు, డ్రోన్లు, ప్రత్యేక సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఢిల్లీ రహదారులపై, ఇండియాగేట్‌ చుట్టుపక్కల ఎక్కడ చూసినా సాయుధ పహారా కనిపిస్తుండటం గమనార్హం. శుక్రవారం రాత్రి పది గంటల నుంచే జంతర్‌మంతర్‌కు చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. శనివారం ఢిల్లీకి చేరుకునే పలు రైళ్లను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ, హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగించే 245 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శుక్రవారం ఉదయం ప్రకటించింది.


ఇక నిరసనకారులకు బస్సులు కేటాయించవద్దని ట్రావెల్స్‌ నిర్వాహకులను ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. సామూహిక బస్సు బుకింగ్స్‌ను రద్దు చేయించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు, ఇతరులకు గదులు ఇవ్వవద్దని హోటళ్లను ఆదేశించారు. పలు స్కూళ్లలో పరీక్షలను వాయిదా వేశారు. తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సూచించారు.

ఎక్కడిక్కడ నిర్బంధం

నిరసనకారులను ఎక్కడిక్కడ నిర్బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. నోయిడా-ఢిల్లీ సరిహద్దుల్లో, చిల్లా సరిహద్దు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీలోనని 15జిల్లా పోలీసు స్టేషన్లలో నిరసన కారులను నిర్బంధించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 9గంటల నుంచే ఢిల్లీ సరిహద్దులను దాదాపు మూసివేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిరసనకారులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడిక్కడ చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. అనేకమంది రైతు సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులను గృహ నిర్బంధంలో ఉంచారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్

Updated Date - Oct 10 , 2026 | 03:43 AM