నచ్చిన స్కూల్లోనే సీటు కావాలనడం విద్యా హక్కు కిందకు రాదు ఢిల్లీ హైకోర్టు
ABN , Publish Date - Apr 05 , 2026 | 06:45 AM
పిల్లలకు విద్యా హక్కు ఉందంటే దానర్థం చదువుల కోసం పాఠశాలలను ఎంచుకునే హక్కు ఉన్నట్టు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పిల్లలకు విద్యా హక్కు ఉందంటే దానర్థం చదువుల కోసం పాఠశాలలను ఎంచుకునే హక్కు ఉన్నట్టు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఫలానా స్కూలులోనే సీటు కావాలంటూ అడిగే హక్కు లేదని తెలిపింది. అలా అడగడం విద్యా హక్కు చట్టం పరిధిలోకి రాదని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఓ ప్రయివేటు పాఠశాలలో సీటు కేటాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ ధర్మాసనం ఈ స్పష్టత ఇచ్చింది. విద్యాహక్కు చట్టం కింద కొన్ని వర్గాల వారికి ప్రయివేటు పాఠశాలల్లో సీట్లు కేటాయించడం వెనక ఉన్న ఉద్దేశం సామాజిక న్యాయమే తప్ప, ఓ హక్కుగా అడిగే అవకాశాన్ని కల్పించడం కాదని తెలిపింది. తన కుమార్తెకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 2023-24 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో చేర్చుకునేందుకు ఓ ప్రముఖ ప్రయివేటు పాఠశాల నిరాకరించడంతో ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!