Share News

కాంగ్రెస్‌ ఆఫీసును ఖాళీ చేయండి

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:56 AM

ఢిల్లీలోని 24, అక్బర్‌ రోడ్‌లోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వచ్చే శనివారంలోగా...

కాంగ్రెస్‌ ఆఫీసును ఖాళీ చేయండి

  • ఎల్లుండిలోగా బంగ్లాను అప్పగించండి.. కేంద్రం నోటీసు

న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీలోని 24, అక్బర్‌ రోడ్‌లోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వచ్చే శనివారం లోగా కార్యాలయం ఉన్న బంగ్లాను ప్రభుత్వానికి అప్పగించాలంటూ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ ఆ పార్టీని ఆదేశించింది. అలాగే, ఢిల్లీలోని 5, రైసినా రోడ్‌లోని యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఈ నెల 28 లోగా ఖాళీ చేయాలని మరో నోటీసు ఇచ్చింది. నిజానికి, కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఢిల్లీలోని కోట్లా మార్గ్‌లో పార్టీ కార్యాలయం కోసం ఇందిరాభవన్‌ను ఏర్పాటు చేసుకుంది. అయితే, పాత కార్యాలయం నుంచే ఇప్పటికీ కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు 48 ఏళ్లుగా అక్బర్‌ రోడ్‌లోని ఈ బంగ్లాయే కాంగ్రెస్‌ ప్రధాన కార్యక్రమాలకు వేదికగా ఉంది. ఢిల్లీలోని తమ కార్యాలయాలు ఉన్న బంగ్లాలకు మార్కెట్‌ రేటు ప్రకారం అద్దె చెల్లిస్తున్నామని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన నోటీసులను కోర్టులో సవాల్‌ చేస్తామని కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ తెలిపారు. ఆ రెండు బంగ్లాలనూ వదులుకునే ప్రసక్తి లేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అంటేనే 24, అక్బర్‌ రోడ్‌ గుర్తుకు వచ్చేంతగా పార్టీ ఘన చరిత్రలో భాగమైన ఈ కార్యాలయంతో తమకు అనుబంధం ఉన్నదని వివరించారు. నిజానికి, ఈ బంగ్లాలను తమ కింద ఉంచుకోవడం కోసం కాంగ్రెస్‌ చాలానే ప్రయత్నాలు చేసింది. తమ ఎంపీలకు వాటిని కేటాయించేలా కేంద్రాన్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 05:56 AM