Cyber Scam in Bihar: గర్భవతిని చేస్తే 10 లక్షలు
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:07 AM
సైబర్ మోసం కొత్త పుంతలు తొక్కుతోంది. బిహార్‌లోని నవాదా కేంద్రంగా మొదలైన ఈ సైబర్ మోసంలో అనేక మంది భారీగానే సొమ్ములు పొగొట్టుకున్నట్లు సైబర్ పోలీసులు....
విఫలమైనా సగం డబ్బు ఖాయం అంటూ బిహార్‌లో కొత్త తరహా సైబర్ మోసాలు
నవాదా(బిహార్), జనవరి 10: సైబర్ మోసం కొత్త పుంతలు తొక్కుతోంది. బిహార్‌లోని నవాదా కేంద్రంగా మొదలైన ఈ సైబర్ మోసంలో అనేక మంది భారీగానే సొమ్ములు పొగొట్టుకున్నట్లు సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు లేని మహిళలతో సెక్స్‌లో పాల్గొని గర్భవతిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఫేస్‌బుక్, వాట్సా్‌పలలో వస్తున్న ప్రకటనలు పూర్తి మోసపూరితమని ఎస్‌పీ అభినవ్ ధీమాన్ పేర్కొన్నారు. ‘‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్, ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ సర్వీస్.. పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాలు కేవలం పురుషులకు మాత్రమే అని వాటిలో పేర్కొంటారు.
భారీగా డబ్బులతో పాటు, మహిళలతో సెక్స్ చేసే అవకాశం వస్తుందంటూ ఆకర్షిస్తారు. సంతానం లేని మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు వస్తాయని, ఒక వేళ గర్భవతి కాకున్నా సగం డబ్బులతో పాటు, ‘సుఖం’ దక్కుతుందంటూ ఆ ప్రకటనల్లో వివరిస్తారు. బాధితుడు ఒకసారి అంగీకరించాక.. రిజిస్ట్రేషన్ చార్జీలు, హోటల్ బుకింగ్స్, ఇతర ఖర్చుల కోసం అంటూ డబ్బులు పిండుతారు. బాధితుడు మోసాన్ని గ్రహించేలోగా భారీగానే కోల్పోతాడు. ఈ తరహా కేసులో నవాదాకు చెందిన రంజన్‌తోపాటు ఒక మైనర్‌ను కూడా అరెస్టు చేశాం’ అని ఎస్పీ వివరించారు.