సాంకేతిక సమస్యతో సీయూఈటీ పరీక్ష ఆలస్యంగా మొదలు! ప్రతిపక్షాల విమర్శలు
ABN , Publish Date - May 30 , 2026 | 04:32 PM
సాంకేతిక లోపం కారణంగా సీయూఈటీ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రతిపక్షాలు కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించాయి.
ఇంటర్నెట్ డెస్క్: డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్‌ల కోసం ఉద్దేశించిన జాతీయ స్థాయి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) సాంకేతిక సమస్య కారణంగా నేడు పలు చోట్ల ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో, ప్రతిపక్షాలు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మొదట నీట్, ఆ తరువాత సీబీఎస్‌ఈ, ఇప్పుడేమో సీయూఈటీ.. జాతీయ స్థాయి పరీక్షల్లో నిర్వహణ లోపాలకు ఇవి ఉదాహరణలు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నాలుగు పరీక్షలు.. కోటి మంది విద్యార్థులు.. కానీ ఒక్క పరీక్ష కూడా నిజాయతీగా నిర్వహించలేకపోయారు’ అని ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యారంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. ఎవరి భవిష్యత్తు అయితే నేడు దెబ్బతింటుందో రేపు వారికే జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సాంకేతిక సమస్య కారణంగా సీయూఈటీ పరీక్ష పలు చోట్ల ఆలస్యంగా ప్రారంభమైందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. సమస్య పరిష్కారమైందని కూడా తెలిపింది. జాప్యం జరిగినందున విద్యార్థులకు అదనపు సమయం కూడా కేటాయించామని చెప్పింది. ఈ మేరకు మధ్యాహ్నం షిఫ్టుల్లో కూడా మార్పులు చేశామని వెల్లడించింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షను 4 గంటలకు మార్చినట్టు తెలిపింది. జాతీయ, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలతో పాటు కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి అడ్మిషన్ల కోసం ఎన్‌టీఏ సీయూఈటీ పరీక్షను నిర్వహిస్తోంది. వివిధ దశల్లో సాగే ఈ పరీక్ష ఈ ఏడాది మే 11 నుంచి మే 31 వరకూ జరగనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఉగ్ర కుట్ర భగ్నం.. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్న 9 మంది అరెస్టు
మండుటెండలో నిరాహార దీక్ష ప్రారంభించిన మనోజ్ జారంగే