నిరసనలకు సిద్ధం కండి.. నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:56 PM
తాను జూన్ 6న భారత్‌కు రానున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చెప్పారు. శాంతియుత నిరసనకు సిద్ధం కావాలంటూ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను జూన్ 6న భారత్‌కు రానున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోమవారం తెలిపారు. పరీక్ష నిర్వహణ లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో శాంతియుత నిరసన కార్యక్రమం చేపడతానని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఢిల్లీలో చేపట్టనున్న ఈ నిరసనలో విద్యార్థులు, తన మద్దతుదారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘మనందరం ఏకమయ్యేందుకు టైమ్ వచ్చింది. రాజ్యాంగం చూపించిన దారిలో ముందుకు సాగుతూ శాంతియుత మార్గంలో గొంతెత్తాలి. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. కలిసికట్టుగా ముందడుగు వేస్తే వాళ్లు మన మాట వినకతప్పదు’ అని చెప్పారు.
‘జూన్ 6న ఢిల్లీకి వద్దామని అనుకుంటున్నాను. ఎయిర్‌పోర్టుకు మీరందరూ రావాలి. అక్కడి నుంచి మనం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శాంతియుత నిరసన కార్యక్రమం కోసం అనుమతి తీసుకుందాం. జంతర్‌మంతర్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపడదాము’ అని చెప్పారు. పరీక్ష నిర్వహణలో లోపాలు, అవాంతరాల కారణంగా విద్యార్థులు ఆందోళనలో కూరుకుపోయారని అభిజీత్ అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నేపథ్యంలో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనత పార్టీ అనతి కాలంలో ఊహించని స్థాయిలో పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఫేక్, బోగస్ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి ప్రవేశిస్తున్న కొందరిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఇక జాతీయ భద్రతా కారణాల రీత్యా కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్‌ను కేంద్రం స్తంభింపజేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు విచారణ చేట్టింది.
ఈ వార్తలనూ చదవండి:
కొత్త పార్టీ యోచనలో అన్నామలై..!
లుధియానాలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి