జంతర్ మంతర్‌లో మొదలైన నిరసన.. పోలీసుల అదుపులో సీజేపీ నేతలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 10:29 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఈరోజు (బుధవారం) ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఈరోజు (బుధవారం) ఉదయం జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ నేతృత్వంలో నిరసనకారులు ఆందోళనలను చేపట్టారు. అయితే వీరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో నిరసనకారులు బారికేడ్లు, గేట్లను దూకుతూ నిరసన ప్రదేశానికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అయితే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని వెంబడించారు. దీంతో నిరసనకారులు ‘భారత్ మాతకు జై’, 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. చివరికి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ సహా నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అభిజీత్ దీప్కే వెల్లడించారు. అలాగే జంతర్ మంతర్‌లో ప్రజా నిరసనలపై నిషేధం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ నిరసన కార్యక్రమాలను నిర్వహించడాన్ని కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్‌కు బదులు రామ్‌లీలా మైదానం, బురాడీ మైదాన్, సీబీడీ గ్రౌండ్‌లలో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.