ప్రజలేమంటున్నారు..!?
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:38 AM
నీట్ పేపర్ లీక్‌పై పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను బలవంతంగా దించివేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరో బృహత్తర కార్యక్రమాన్ని...
‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో సీజేపీ కొత్త కార్యక్రమం
వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా నిర్వహణ
ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకొంటాం
గత 10-12 ఏళ్లుగా ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాం
ఇకపై ప్రజలు రోడ్లపైకి వచ్చి హక్కుల కోసం పోరాడుతారు
దేశంలో 60ు మంది 35 ఏళ్ల లోపువారే
వారిని పరిగణనలోకి తీసుకోని ఏ ప్రభుత్వ పథకమూ సక్సెస్ కాదు
కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటన
ఛత్రపతి శంభాజీనగర్, ఆగస్టు 6: నీట్ పేపర్ లీక్‌పై పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను బలవంతంగా దించివేసిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలో ప్రజలు ప్రస్తుత పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు? వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొనేందుకు ‘క్యా బోల్తీ పబ్లిక్’ (ప్రజలేమంటున్నారు?) పేరుతో వచ్చే నెలలో దేశవ్యాప్తం కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వస్థలం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం నుంచి నిర్వహించిన సీజేపీ కోర్ టీమ్ సమావేశాలు గురువారం ముగిశాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొనేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
ప్రజల మనసుల్లోని భయాన్ని తొలగించాం
దేశ జనాభాలో ప్రస్తుతం 60 శాతం మంది 35 ఏళ్లలోపువారేనని, వారిని విస్మరించి ప్రభుత్వాలు అమలుచేసే ఏ పథకమూ విజయవంతం కాదని అభిజీత్ దీప్కే అన్నారు. గత 10-12 ఏళ్లుగా ప్రజల మనసుల్లో నిండిపోయిన భయాన్ని తమ పోరాటంతో తొలగించామని తెలిపారు. ఇకపై ప్రజలంతా ధైర్యంగా రోడ్లపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం చేయగలరని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం దేశ పరిస్థితుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో క్యా బోల్తీ పబ్లిక్ కార్యక్రమం ద్వారా తెలుసుకోవాలని భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ సిద్ధాంతాల ఆధారంగా ఈ దేశ అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. భారత రాజ్యాంగ విలువలే మా పార్టీ సిద్ధాంతం’ అని తెలిపారు.
విద్య, ఉద్యోగాలే మా ఎజెండా
విద్యా వ్యవస్థలోసంస్కరణలు, నిరుద్యోగ సమస్య నిర్మూలనే తమ పోరాట ఎజెండా అని దీప్కే ప్రకటించారు. ‘దేశంలో ప్రస్తుతం నిరుద్యోగమే ప్రధాన సమస్య. మా పోరాటాల ద్వారా దీనిని జాతీయ అంశంగా మార్చుతాం. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం పనిచేస్తాం. పాఠశాల స్థాయి నుంచే చాలామందికి నాణ్యమైన విద్య అందని ద్రాక్షలా మారింది. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన విద్యను.. కొందరు తమ వ్యాపారాల అభివృద్ధికి ప్రాథమికవ్యాపారంగా మార్చుకున్నారు. స్కూలు, కాలేజీ, కోచింగ్ ఫీజులు భరించలేనంతగా పెరిగాయి. ఒకటో తరగతికే రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటికి డొనేషన్లు అదనం. ఇంత ఫీజు పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా చెల్లించగలరు? అందుకే ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించాం. మీడియాలో కూడా విశ్వసనీయతను తిరిగి తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం’ అని వెల్లడించారు. కాగా, ఈ సమావేశాల్లోనే పార్టీ తొలి నేషనల్ వర్కింగ్ కమిటీని కూడా ఎన్నుకున్నారు. దేశం నలుమూలల పార్టీని విస్తరించేందుకు నాలుగు జోన్లకు ఇన్‌చార్జిలను నియమించారు. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్ర, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని అభిజీత్ దీప్కే తెలిపారు. నేషనల్ వర్కింగ్ కమిటీలో ఒక తెలుగు వ్యక్తికి చోటు దక్కింది.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు