Share News

సీఐఎస్ఎఫ్‌ సిబ్బందిపై జవాన్‌ కాల్పులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:30 AM

డ్యూటీ మార్పు సమయంలో చిన్నగా మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరి నలుగురు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలను బలితీసుకుంది.

సీఐఎస్ఎఫ్‌ సిబ్బందిపై జవాన్‌ కాల్పులు
ANA

  • ఒక అధికారి సహా నలుగురు మృతి

  • డ్యూటీ మార్పు సమయంలో

గొడవ.. ఏకే-47తో కాల్పులు

శ్రీనగర్‌, సెప్టెంబరు 29: డ్యూటీ మార్పు సమయంలో చిన్నగా మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరి నలుగురు సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది ప్రాణాలను బలితీసుకుంది. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన హెడ్‌ కానిస్టేబుల్‌ అవధేశ్‌ సింగ్‌ ఏకే-47 తుపాకీతో తోటివారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీనితో అసిస్టెంట్‌ కమాండెంట్‌ అంకిత్‌కుమార్‌ పాండే, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌సింగ్‌, కానిస్టేబుళ్లు మహమ్మద్‌ రఫీక్‌, సంజీవ్‌కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించినా.. పరిస్థితి విషమించి కాసేపటికే మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మష్కాలో సేవా-2 జల విద్యుత్‌ కేంద్రం వద్ద ఉన్న సీఐఎ్‌సఎఫ్‌ క్యాంపులో మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులకు సమీపంలో ఈ విద్యుత్‌ కేంద్రం ఉంటుంది. అవధేశ్‌ సింగ్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీఐటఎస్ఎఫ్‌ ప్రధాన కార్యాలయం కూడా దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. నిజానికి ఈ కాల్పుల ఘటనను తొలుత ఉగ్రదాడి కావొచ్చనే ప్రచారం జరిగింది. కానీ అధికారులు దీనిని ‘ఫ్రాట్రిసైడ్‌’గా చెబుతున్నారు. అంటే ఒకే దళం లేదా విభాగానికి చెందిన సిబ్బంది వారిలో వారే కాల్పులకు పాల్పడటం అని చెప్పవచ్చు. కాల్పులకు పాల్పడిన సమయంలో అవధేశ్‌ సింగ్‌ వద్ద ఏకే-47 సర్వీసు తుపాకీ, 150 రౌండ్ల బుల్లెట్లు ఉన్నట్టు సీఐఎస్ఎఫ్‌ వర్గాలు తెలిపాయి.

Updated Date - Sep 30 , 2026 | 05:37 AM