చెన్నైలో ‘సూపర్ ట్రీ టవర్’
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:07 AM
చుట్టూ పచ్చదనం.. మధ్యలో 9 అంతస్తుల టవర్.. ఓ పక్కనుంచి మనసుకు హాయినిచ్చే సంగీతం.. దానిపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్లో మెరీనా బీచ్ అందాలను వీక్షించే వారికి...
సింగపూర్ తరహాలో దేశంలోనే తొలిసారి ఏర్పాటు
చెన్నై, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): చుట్టూ పచ్చదనం.. మధ్యలో 9 అంతస్తుల టవర్.. ఓ పక్కనుంచి మనసుకు హాయినిచ్చే సంగీతం.. దానిపై నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్లో మెరీనా బీచ్ అందాలను వీక్షించే వారికి మధురానుభూతిని పంచే ‘సూపర్ ట్రీ టవర్’ చెన్నైలో ఏర్పాటైంది. క్యాథడ్రల్ రోడ్డులోని కలైంజర్ సెంటినరీ పార్క్‌లో సింగపూర్ తరహాలో రూ.11.84 కోట్ల వ్యయంతో 9 అంతస్తులతో దేశంలోనే తొలిసారిగా నిర్మించిన ఈ సూపర్ ట్రీ టవర్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ 30 మీటర్ల ఎత్తయిన ఈ టవర్‌కు 24 మీటర్ల పొడవైన స్టీల్ రాడ్లతో కూడిన పచ్చదనపు కొమ్మలు, రాత్రిపూట జిగేల్‌మనే విద్యుత్ దీపాలు, హృద్యమైన సంగీతం.. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 7వ అంతస్తులో గాజు గది, ఓపెన్ టెర్రస్ ఏర్పాటు చేశారు. సందర్శకులు ఇక్కడి నుంచి మెరీనాతీరం అందాలను, ఎంఏ చిదంబరం స్టేడియాన్ని వీక్షించవచ్చు. ఒకేసారి గరిష్టంగా 50 మంది సందర్శకులను 45 నిమిషాల పాటు అనుమతించనున్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణత 33 శాతం పెంచాలన్న లక్ష్యంతో స్టాలిన్ ప్రభుత్వం ‘తమిళనాడు వ్యవసాయ అడవుల పెంపకం విధానం 2026’ను రూపొందించింది. ఈ పథకంలో భాగంగా సూపర్ ట్రీ టవర్‌ను నిర్మించింది.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..