పునర్విభజన.. మళ్లీ తెరపైకి!
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:56 AM
నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ నెలాఖరులోగా సంబంధిత బిల్లును ఆమోదింపజేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
నెలాఖరులోగా బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు
ఇందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. డీఎంకే, ఇతర పార్టీల మద్దతు?
తొలుత అఖిలపక్షం పెట్టాల్సిందే.. ప్రధానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ
న్యూఢిల్లీ, అక్టోబరు 16: నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ నెలాఖరులోగా సంబంధిత బిల్లును ఆమోదింపజేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోవడంతో ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రె్‌సకు దూరమైన డీఎంకేతో పాటు ఇతర చిన్న పార్టీలతో కేంద్రం సంప్రదింపులు జరిపి వాటి మద్దతు పొందేందుకు తెరవెనుక ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓపక్క ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలంటూ విపక్ష ఇండీ కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఢిల్లీలో వరుస ఆందోళనలు చేపడుతున్న ఈ తరుణంలో.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బిల్లుకు ఆమోదముద్ర వేయించుకోవాలని మోదీ ప్రభుత్వం సంకల్పించడం గమనార్హం. మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లోనే ఆమోదించారు. అయితే ఇప్పుడు దాని అమలును పునర్విభజన బిల్లుకు లింకు చేశారు. లోక్‌సభతో పాటు ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచి మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ను అమలు చేయడం ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఉద్దేశం.అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాదికి రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఉత్తరాదికి ప్రాధాన్యం పెరుగుతుందని డీఎంకే, ఆ ప్రాంతానికి చెందిన పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఆ పార్టీని సంప్రదించిన బీజేపీ పెద్దలు.. దాని ఆందోళనలను చాలావరకు పరిష్కరించినట్లు చెబుతున్నారు. అలాగే ఇతర చిన్న పార్టీల మద్దతు కూడా కూడగడుతున్నట్లు తెలిసింది. మూడింట రెండొంతుల మెజారిటీ కచ్చితంగా సాధించగలమన్న నమ్మకం కుదరగానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి బిల్లును ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే ఈ బిల్లు ప్రతిపాదనలపై ముందుగానే రాజకీయ పార్టీలతో చర్చించాలని, ఇందుకోసం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగినా.. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్), సీఈసీకి వ్యతిరేకంగా ఉభయసభలనూ విపక్షాలు అడ్డుకున్నాయి. పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడి రెండు నెలలు దాటినా ఇంతవరకు ప్రొరోగ్ చేయలేదు. పునర్విభజన బిల్లు కోసమే ప్రొరోగ్‌ను ఆపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ‘అసాధారణ’ జాప్యాన్ని ఖర్గే ప్రశ్నించారు. ప్రతిపక్షాలను మరోసారి బుల్డోజ్ చేసి బిల్లును ఆమోదించుకునేందుకు ప్రయత్నించవద్దని ప్రధానికి సూచిస్తూ శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కొత్త ప్రతిపాదనలేమైనా ఉంటే అఖిల పక్షం పెట్టి చర్చించాలని అందులో కోరారు. ‘ఈ అంశంపై అఖిల పక్షాన్ని పిలవాలని ఈ ఏడాది ఏప్రిల్ 11నే మీకు లేఖ రాశాను. కానీ మీరు పిలువలేదు. ఏప్రిల్ 14 రాత్రి బిల్లులను బహిరంగ పరిచారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఏప్రిల్ 17న అది వీగిపోయింది’ అని గుర్తుచేశారు. ఆ తర్వాత జూలై 16, ఆగస్టు 27న కూడా అఖిలపక్షం కోసం ప్రధానికి లేఖ రాశానని.. ఇప్పుడు నాలుగోసారి రాస్తున్నట్లు తెలిపారు. పార్లమెంటు పరిశీలనకు వెళ్లేముందే బిల్లులోని కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ అవసరమని అభిప్రాయపడ్డారు. కీలకమైన బిల్లుపై అంతర్గతంగా చర్చించుకోవడానికి అన్ని పార్టీలకు సమయమివ్వాలన్నారు. ఖర్గే లేఖను జైరాం రమేశ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ప్రభుత్వం మొదట ఉభయసభలను ప్రొరోగ్ చేయాలని.. ఆ తర్వాత బిల్లుపై అఖిలపక్షం ఏర్పాటుచేయాలని స్పష్టంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీలో నిరసనలతో రూ.2వేల కోట్ల వ్యాపార నష్టం? ప్రధాని మోదీకి వర్తక సంఘాల లేఖ
ఢిల్లీలో సీజేపీ నేతల అరెస్టుతో ఉద్రిక్తత.. కన్నాట్ ప్లేస్‌లో జాతీయ జెండా ఎగురవేతకు పిలుపు