వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు కేంద్రం బ్రేకులు!
ABN , Publish Date - Jul 01 , 2026 | 08:27 PM
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ భారత్‌లో ప్రారంభం కాకుండా కేంద్రం బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మరిన్ని సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ విషయంలో కేంద్రం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను భారత్‌లో లాంచ్ చేయవద్దని వాట్సాప్ మాతృసంస్థ మెటాను కేంద్రం ఆదేశించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ అంశంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఫీచర్‌పై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు? అనే విషయాలు చెప్పాలని కేంద్రం కోరినట్టు సమాచారం.
యూజర్ల వ్యక్తిగత గోప్యత వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు యూజర్‌నేమ్ ఫీచర్‌ను తెస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ మెటా ఇటీవల పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు కొత్త వారితో చాటింగ్ కోసం ఫోన్ నెంబర్లు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. తమ అకౌంట్ యూజర్ఐడీ ఇస్తే సరిపోతుంది. అయితే, భారత్ లాంటి దేశంలో ఈ ఫీచర్ కొత్త చిక్కులు తేవొచ్చన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది అనేక మోసాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసాలు జరిగిన సందర్భాల్లో నిందితులు ఎవరో తెలుసుకోవడం ఈ ఫీచర్‌తో మరింత కష్టంగా మారుతుందని అనుమానిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు.. రూ.70 లక్షలు సీజ్
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నజర్!