Share News

అగ్నివీరులకు దీపావళి కానుక

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:30 AM

అగ్నిపథ్‌ పథకం కింద సైనిక దళాల్లో చేరిన అగ్ని వీరులందరినీ దశలవారీగా రెగ్యులర్‌ ఆర్మీలోకి తీసుకోవాలని కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది.

అగ్నివీరులకు దీపావళి కానుక
agniveers

  • దశల వారీగా రెగ్యులర్‌ ఆర్మీలోకి..

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • 18,300 మందికి తక్షణ ప్రయోజనం

న్యూఢిల్లీ, నవంబరు 5: అగ్నిపథ్‌ పథకం కింద సైనిక దళాల్లో చేరిన అగ్ని వీరులందరినీ దశలవారీగా రెగ్యులర్‌ ఆర్మీలోకి తీసుకోవాలని కేంద్రం కీలకనిర్ణయం తీసుకుంది. త్వరలోనే సైన్యాన్ని వదిలి బయటకు వస్తున్న 18,300 మందికి దీపావళి కానుకను అందించింది. అగ్నివీరులుగా పనిచేసి బయటకు వెళ్లేవారిలో 25శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాలనే నిబంధన ఇప్పటికే ఉంది. తాజాగా దానిని తక్కిన 75శాతం మందికీ వర్తింపజేయాలని రక్షణశాఖ నిర్ణయం తీసుకుంది. వీరి సర్వీసును రెండేళ్లకు పొడిగిస్తూ, కేంద్ర క్యాబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అగ్నివీరుల సంసిద్ధత, శారీరక దారుఢ్యం ఆధారంగా ఈ ఎంపిక ఉంటుందని రక్షణ శాఖ ప్రకటించింది. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ గురువారం మరో ప్రకటన వెలువరించింది. అదనంగా రెండేళ్ల సర్వీసు కోసం ఎంపిక చేసినవారందరినీ, ఆ కాలం పూర్తవ్వగానే రెగ్యులర్‌ ఆర్మీలోకి తీసుకుంటామని వెల్లడించింది. సర్వీసు సమస్య తలెత్తకుండా, అప్పటికే రెగ్యులర్‌ ఆర్మీలో (25శాతం) చేరి, పనిచేస్తున్న అగ్నివీరులతో సమానంగా వీరి సీనియారిటీని పరిగణిస్తామని రక్షణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 06:37 AM