పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి పోలీసులపై కాల్పులు.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:13 PM
జువెనైల్ హోమ్‌లో ఖైదీ ఘాతుకానికి ఒడిగట్టాడు. నాటు తుపాకితో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మరో ఇద్దరు ఖైదీలతో కలిసి జువెనైల్ హోమ్ నుంచి పారిపోయాడు.
జమ్మూకాశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. జువెనైల్ హోమ్‌లో ఓ ఖైదీ దారుణానికి ఒడిగట్టాడు. నాటు తుపాకితో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మరో ఇద్దరు ఖైదీలతో కలిసి జువెనైల్ హోమ్ నుంచి పారిపోయాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్‌ఎస్ పురకు చెందిన కరజీత్ సింగ్ అలియాస్ గుగ్గా.. పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ సునావుల్లా, అహ్‌సన్ అన్వర్‌లు ఆర్ఎస్ పురలోని జువెనైల్ అబ్జర్వేషన్ హోమ్‌లో ఖైదీలుగా ఉంటున్నారు. సోమవారం సాయంత్రం వీరు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
అడ్డుకున్న పోలీసులపై ఖైదీల్లో ఒకరు.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురు ఖైదీలు జువైనల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ ముగ్గురు ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఓ వ్యక్తిని తుపాకితో భయపెట్టి, అతడి బైక్‌ను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.
ఖైదీ దాడిలో గాయపడ్డ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వినయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్‌లు ప్రస్తుతం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలులోకి తుపాకి ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఘటనపై దర్యాప్తునకు సైతం ఆదేశించారు. ఖైదీ పోలీసులపై నాటు తుపాకితో దాడికి పాల్పడ్డ దృశ్యాల తాలూకా సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..