సుప్రీంకోర్టుకు చేరిన కావేరి వివాదం
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:54 AM
కావేరీ నదీ జలాల్లో తమకు రావాల్సిన వాటాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది....
చెన్నై/బెంగళూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కావేరీ నదీ జలాల్లో తమకు రావాల్సిన వాటాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కర్ణాటక ప్రభుత్వం కావేరి జల నిర్వహణ సంస్థ (సీడబ్ల్యూఎంఏ), కావేరీ జల నియంత్రణ మండలి (సీడబ్ల్యూఆర్‌సీ) ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. జూలై 28న జరిగిన సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం జూలై 29 నుంచి 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని జూలై 30న జరిగిన 54వ అత్యవసర సమావేశంలో సీడబ్ల్యూఎంఏ కూడా సమర్థించింది. అయితే జూలై 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు చేరిన నీటి ప్రవాహం 158 నుంచి 550 క్యూసెక్కులు మాత్రమే ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఇది సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశాలకు పూర్తిగా విరుద్థమని ఆరోపించింది. ఆగస్టు 3వ తేదీ నాటికి కర్ణాటకలోని కేఆర్‌ఎస్, కబిని, హరంగీ, హేమావతి రిజర్వాయర్లలో మొత్తం 77.537 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో వాటా ప్రకారం నీటిని విడుదల చేయడంలో కర్ణాటకకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..