చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.10 వేల కోట్లతో నిధి
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:17 AM
దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం కేంద్రప్రభుత్వం రూ.10 వేల కోట్లతో అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది
ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, అక్టోబరు 6: దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం కేంద్రప్రభుత్వం రూ.10 వేల కోట్లతో అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. తయారీ, సేవలు, టెక్నాలజీ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక విభాగాలు తదితర రంగాల్లో ఉన్న భారతీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఛాంపియన్లుగా నిలిపే లక్ష్యంతో దీనిని నెలకొల్పినట్లు పేర్కొంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ నిధి ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం, ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవటం, ఉత్పాదకతను పెంచటం, ఎగుమతుల్లో పోటీ పడేలా తయారు కావటం తదితర అంశాలకు సంబంధించి రూ.10 వేల కోట్ల నిధిని ఉపయోగిస్తామన్నారు. దేశంలోని టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రధానంగా తయారీ రంగంలో ఉన్న వాటికి ఈ నిధిలో ఎక్కువ మొత్తాన్ని వినియోగిస్తామని తెలిపారు. మరోవైపు, ‘సమీకృత రవాణా, లాజిస్టిక్స్ అథారిటీ’ (ఐటీఎల్‌ఏ) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో ప్రణాళికలు, పరిశోధనలు, ప్రాజెక్టు అంచనాలు, ప్రాజెక్టు అమలులో పరిశీలన, విధానపరమైన మద్దతు, డేటా ఎనలిటిక్స్ అంశాల్లో ఇది కీలక సంస్థగా పని చేస్తుందన్నారు. రూ.500 కోట్లు ఆపైన వ్యయం అయ్యే ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఐటీఎల్‌ఏ సాంకేతిక అధ్యయనం కూడా జరుపుతుందని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన