బ్రహ్మోస్‌కు ఉత్పత్తి కష్టాలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:08 AM
భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంలాంటి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్లాంటులో...
హైదరాబాద్, నాగ్‌పూర్ సెంటర్ల నుంచి సీనియర్ ఉద్యోగుల బదిలీ
రాజస్థాన్, యూపీకి వెళ్లేందుకు నిరాకరణ
ఉద్యోగుల అసంతృప్తి.. కొందరి రాజీనామా
సిబ్బంది కొరతతో 50 శాతం
పడిపోయిన బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి
కొత్తతరం ‘బ్రహ్మోస్’కు అనుమతివ్వని కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంలాంటి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్లాంటులో తయారు చేయదలిచిన నూతన తరం బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తికి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం అనుమతే ఇవ్వలేదు. అయినా దక్షిణాదిలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి కీలక ఉద్యోగులను రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లకు బదిలీ చేసింది. కొన్ని నెలలుగా హైదరాబాద్, నాగపూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ కేంద్రాల నుంచి యూపీలోని లఖ్‌నవూ, రాజస్థాన్‌లోని పిలానీలకు సుమారు 56 మంది సీనియర్‌సిబ్బందిని బదిలీ చేశారు. ఈ ఆకస్మిక బదిలీలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అక్కడికి వెళ్లేందుకు వారు నిరాకరించారు. కొందరు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. దీంతో క్షిపణుల ఉత్పత్తి 50 శాతం తగ్గిపోయిందని ఎన్‌బీటీ ఆన్‌లైన్ అనే వార్తా సంస్థ వెల్లడించింది. అనుభవజ్ఞులైన సిబ్బందిని ఉన్నట్టుండి బదిలీ చేయడంతో క్షిపణి అసెంబ్లింగ్, వ్యవస్థల అనుంధానం వంటి కీలక విభాగాల్లో సిబ్బంది కొరత ఏర్పడి ఉత్పత్తి తగ్గిందని పేర్కొంది. లఖ్‌నవూలోని తన ఉత్పత్తి కేంద్రాన్ని విస్తరించే పనిలో ఉంది. ఇక్కడ భవిష్యత్ తరం బ్రహ్మో్‌స-ఎన్‌జీ (న్యూ జనరేషన్) క్షిపణుల అభివృద్ధి, పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2021లోనే ఇక్కడ బ్రహ్మో్‌స-ఎన్‌జీ క్షిపణి అభివృద్ధి, పరీక్ష కేంద్రం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, పనులు ప్రారంభించింది. అయినప్పటికీ ఆ క్షిపణి అభివృద్ధికి మాత్రం ఇంకా ఆమోదం లభించలేదు.
భారత నౌకాదళంపై ప్రభావం..
2024 మార్చి 1న భారత నౌకాదళం 220 బ్రహ్మోస్ క్షిపణులు కావాలని ఆర్డర్ చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలపడుతున్న చైనాకు చెక్ పెట్టాలంటే భారత నౌకాదళానికి బ్రహ్మోస్ క్షిపణులు చాలా కీలకం. ఇలాంటి తరుణంలో బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి తగ్గిపోతే నేవీకి డెలివరీలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్ కోల్‌కతా క్లాస్ యుద్ధనౌకలు బ్రహ్మోస్ క్షిపణులు లేనిదే పూర్తిస్థాయి పోరాట పటిమను ప్రదర్శించలేవు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ ఏరోస్పే్‌సలో ఉద్యోగుల బదిలీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి పడిపోవడం రక్షణ రంగానికి గట్టి ఎదురుదెబ్బేనని, ఇది భారత సాయుధ దళాల పోరాట సామర్థ్యాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం