మెడికల్, ఇంజినీరింగ్ అడ్మిషన్లలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ!
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:35 PM
మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లలో ఇకపై బోర్డు ఎగ్జామ్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పోటీ పరీక్షల తీరుతెన్నులపై విమర్శలు పెరుగుతున్నాయి. పేపర్ లీకేజీ ఉదంతాలు, విపరీత పోటీతో విద్యార్థులపై ఒత్తిడి, కోచింగ్ సెంటర్ల నిర్వాకాల నేపథ్యంలో పోటీ పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు జరగాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్, ఇంజనీరింగ్ అడ్మిషన్లకు పోటీ పరీక్షల ర్యాంకుతో పాటు బోర్డు ఎగ్జామ్ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాన్ని ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అడ్మిషన్ల సమయంలో బోర్డు ఎగ్జామ్ మార్కులకు ఏకంగా 50 శాతం వెయిటేజీ ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
‘బోర్డు ఎగ్జామ్ మార్కులకు 50 శాతం వెయిటేజీతో పాటు, పాఠశాల సిలబస్‌కు దగ్గరగా పోటీ పరీక్షల సిలబస్ కూర్పు వంటివి పరిశీలనలో ఉన్నాయి. కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు ఆధారపడాల్సిన పరిస్థితిని తొలగించేలా ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. చివరకు ఆన్ డిమాండ్ కంటప్యూటర్ బేస్డ్ టెస్టుల దిశగా చర్చలు జరుగుతున్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రస్తుతం పోటీ పరీక్షల్లో విద్యార్థుల మార్కుల ఆధారంగా మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కేటాయింపు జరుగుతోంది. బోర్డు పరీక్షల్లో నిర్ణీత క్వాలిఫయ్యింగ్ మార్కులు సాధించిన వారు అడ్మిషన్లకు అర్హులు. ఇక కోచింగ్ సెంటర్ల ప్రాబల్యం, డమ్మీ స్కూల్స్ సమస్యను పరిష్కరించేందుకు గతేడాది విద్యాశాఖ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైంది. బోర్డు ఎగ్జామ్స్ వెయిటేజీ అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తోందని సమాచారం. మరికొన్ని వారాల్లో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
ఈ వార్తలనూ చదవండి:
సీనియర్ నేత మనీశ్ తివారీని పక్కన పెట్టిన కాంగ్రెస్!
విరాళాల వివాదంలో కీలక పరిణామం.. చంపత్ రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు..