ముందుముందు అగ్నిపరీక్షే!
ABN , Publish Date - May 05 , 2026 | 04:56 AM
బెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను అంతం చేసి అధికారంలోకి వచ్చి, 15 ఏళ్లపాటు తిరుగు లేకుండా పాలించిన టీఎంసీ..
కోల్‌కతా, మే 4: బెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను అంతం చేసి అధికారంలోకి వచ్చి, 15 ఏళ్లపాటు తిరుగు లేకుండా పాలించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ చెక్ పెట్టింది. టీఎంసీకి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన మమతకు ప్రస్తుతం 71 ఏళ్లు. వచ్చే ఐదేళ్లు టీఎంసీ ప్రతిపక్షంలోనే ఉంటుంది. ఈ ఐదేళ్లలో బీజేపీని తట్టుకొని పార్టీని నిలబెట్టుకోవటం ఆమెకు కత్తిమీద సామేనని విశ్లేషకులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో టీఎంసీ నిర్మాణం దెబ్బతినడం, ఆ పార్టీకి పట్టున్న వర్గాలను బీజేపీ ఆకర్షించడం దీనికి కారణం. పైగా మమత రాజకీయ వారసుడిగా చెబుతున్న అభిజిత్ బెనర్జీని వ్యూహాలు ఫలితమివ్వలేదు. ఇప్పుడు గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేల్లో ఎందరు ఉంటారో చెప్పలేమన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

రికార్డు స్థాయి పోలింగ్ ..టీఎంసీ కొంప ముంచిందా?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు కావటం టీఎంసీ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందా అనే చర్చ జరుగుతోంది. దేశ చరిత్రలోనే అత్యధికంగా 92.47 శాతం పోలింగ్ ఇక్కడ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో 97 శాతం నమోదైంది. ఎన్నికలకు ముందు దాదాపు 91 లక్షల ఓట్లను సర్ ప్రక్రియలో భాగంగా తొలగించారు. అవన్నీ చనిపోయినవారు, రాష్ట్రం విడిచి వెళ్లినవారి ఓట్లేనని, కొన్ని దొంగ ఓట్లు కూడా ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తొలగింపు కూడా రికార్డు స్థాయిలో పోలింగ్‌కు కారణమని చెబుతున్నారు. బెంగాల్‌లో ఎన్నికల సమయంలో హింస చెలరేగటం సాధారణం. ఈసారి ఈసీ భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో మహిళలు, యువత ధైర్యంగా ఓటేయడానికి వచ్చారని అంటున్నారు.

దాడులు జరిగిన చోట్ల ఫలితాలివే!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి విడతలో ఇద్దరు బీజేపీ అభ్యర్థులపై పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరగ్గా.. రెండో విడతలో కొన్ని చోట్ల ఈవీఎంలపై పలు పార్టీల గుర్తులు కనిపించకుండా టేప్‌లు వేసిన ఘటనలు జరిగాయి. కుమార్‌గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కారుపై మూకదాడి జరిగింది. ఆయన 6 వేలకు పైగా ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అసన్సోల్ సౌత్ బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఆమె 40 వేలపైగా మెజార్టీతో టీఎంసీ అభ్యర్థిపై గెలిచారు. బీజేపీ, సీపీఎం అభ్యర్థుల పేర్లు, గుర్తులు కనిపించకుండా చేసిన ఘటనల నేపథ్యంలో పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించిన మగ్రాహట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ సీట్లలో టీఎంసీ అభ్యర్థులే గెలిచారు.