అతడే ఒక సైన్యం
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:12 AM
నగరంలోని మురుగు నీరంతా నదుల్లోకి ప్రవహిస్తున్నా మనం పట్టించుకోం! ప్లాస్టిక్, ఇతర చెత్తాచెదారం అంతా చేరి ఆ నదే మురుగు కాల్వలా మారిపోతున్నా మనకు చీమకుట్టినట్టయినా ఉండదు.
మధ్యప్రదేశ్‌లో కాలుష్యకాసారంలా మారిన నదిని శుభ్రం చేసిన యువకుడు
స్పందించిన మునిసిపల్ అధికారులు
వ్యర్థాల తొలగింపునకు భారీ యంత్రాలు
రూ.14.77 కోట్లతో ఎస్టీపీ ఏర్పాటుకూ ప్రతిపాదనలు.. అభినందించిన సీఎం
తమతో కలిసి పని చేయాలంటూ ఆఫరిచ్చిన ‘ఓషన్ క్లీనప్’ వ్యవస్థాపకుడు
మధ్యప్రదేశ్‌లో కాలుష్యకాసారంలా మారిన అజ్నార్ నదిని శుభ్రం చేసిన యువకుడు
భోపాల్, సెప్టెంబరు 6: నగరంలోని మురుగు నీరంతా నదుల్లోకి ప్రవహిస్తున్నా మనం పట్టించుకోం! ప్లాస్టిక్, ఇతర చెత్తాచెదారం అంతా చేరి ఆ నదే మురుగు కాల్వలా మారిపోతున్నా మనకు చీమకుట్టినట్టయినా ఉండదు. ఎప్పుడైనా ఆ దారిన వెళ్లాల్సి వస్తే.. ఆ వాసనకు ముక్కు మూసుకుని పక్కనుంచి తప్పుకొనిపోతాం!! కానీ.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బ్యావరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్ట తబాహీ అనే 21 ఏళ్ల యువకుడు, బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. తమ ఊరిగుండా ప్రవహిస్తున్న అజ్నార్ నది కాలుష్య కాసారంలా మారిపోతుంటే చూస్తూ ఉండలేకపోయాడు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఈ ఏడాది జనవరి 26న తానే రంగంలోకి దిగాడు. చెత్తాచెదారం పేరుకుపోయి డంపింగ్‌యార్డ్‌లా మారిపోయిన నదిని శుభ్రం చేయడం ప్రా రంభించాడు. తనకు ఈత రాకు న్నా.. ఎలాంటి అనుభవం, అధునాతన పరికరాలు లేకున్నా.. చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్లు సోకినా.. చర్మంపై దద్దుర్లు వచ్చినా.. పాములు, పురుగులు కనిపిస్తున్నా.. చెక్కుచెదరకుండా మొక్కవోని దీక్ష తో కొంత ప్రాంతాన్ని శుభ్రం చేసి.. నదిని అద్దంలా మార్చేశాడు! మధ్యలో అతడికి కొంతమంది స్నేహితులు కూడా తోడయ్యారు. నదిని శుభ్రం చేయడానికి ముందు.. చేసిన త ర్వాత వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో.. స్థానిక మునిసిసాలిటీ అధికారులు కూడా స్పందించారు.
భారీ యంత్రాలు, పొక్లెయిన్ ఎక్స్‌కవేటర్లను రంగంలోకి దించారు. అంతేకాదు.. శుద్ధిచేయని మురుగునీరంతా ఐదు ప్రధాన డ్రెయిన్ల ద్వారా నదిలో కలుస్తున్నట్టు గుర్తించి, ఆ మురుగునీటి శుద్ధి కోసం రూ.14.77 కోట్లతో ఒక సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అది పూర్తయితే అజ్నార్ నదిలోకి మురుగునీటి రాక ఆగిపోతుంది.

మాతో వస్తావా..
సోషల్ మీడియాలో వైరల్ అయిన బిట్టు వీడియోలు.. నెదర్లాండ్స్‌కు చెందిన ‘ద ఓషన్ క్లీనప్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో బోయన్ స్లాట్ దాకా చేరాయి. ‘నాన్‌ఈస్థటిక్‌థింగ్స్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ అయిన బిట్టు ఫొటోలను చూసిన బోయన్ స్లాట్.. ‘‘సురేందర్.. రా మాతో కలిసి పనిచేయి’ అంటూ ఉద్యోగం కూడా ఆఫర్ చేశారు. అంతేకాదు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అతణ్ని స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. అతడి ప్రయత్నాన్ని ప్రశంసించి.. ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుందని హామీ ఇచ్చారు.