గంటకు 498 కి.మీ. వేగంతో ‘ఆహుతి ఎంకే-2’ డ్రోన్ రికార్డ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:42 AM
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంప్‌సలోని రక్షణ సాంకేతిక స్టార్టప్ అపోలియన్ డైనమిక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ సంస్థ రూపొందించిన...
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి బిట్స్ హైదరాబాద్ స్టార్టప్
బిట్స్‌పిలానీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంప్‌సలోని రక్షణ సాంకేతిక స్టార్టప్ అపోలియన్ డైనమిక్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ సంస్థ రూపొందించిన మల్టీరోటర్ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ ‘ఆహుతి ఎంకే-2’.. గంటకు 498 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో చోటు దక్కించుకుంది. ఒక మల్టీరోటర్ ఈ స్థాయి వేగాన్ని నమోదు చేయడం దక్షిణాసియాలోనే మొదటిసారి. ఆధునిక యుద్ధాల్లో శత్రుదేశాలు ప్రయోగించే తక్కువ ఖర్చుతో కూడిన షాహెద్ తరహా డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్లను ఆకాశంలోనే అత్యంత వేగంగా అడ్డుకునేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. నిజానికి.. అపోలియన్ డైనమిక్స్ తొలుత అభివృద్ధి చేసిన ‘ఆహుతి’ 2025లో సుమారు 300కిలోమీటర్ల వేగాన్ని సాధించింది. ఏడాదిలోనే ఆ వేగాన్ని 66ు పెంచి ఆహుతి ఎంకే-2ను రూపొందించారు. అపోలియన్ డైనమిక్స్‌ను జయంత్ ఖత్రి, సౌర్య చౌదరి స్థాపించారు. ఆహుతి ఎంకే-2 అభివృద్ధిలో అమన్ విరాణి (షాడీ), మానస్ విచారే, ఇషాన్ సూరి కీలకంగా వ్యవహరించారు. డ్రోన్ పైలట్‌గా పేరున్న అమన్ విరాణి విమాన పరీక్షలు, అభివృద్ధి ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించారు. కాగా.. 2025 ఏర్పాటైన అపోలియన్ డైనమిక్స్ బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంప్‌సలో ఇంక్యుబేట్ అవుతోంది. భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఇప్పటికే భారత సైన్యానికి కొన్ని వ్యవస్థలను అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..