బెంగళూరు ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. ప్రయాణికుడి నోటిలో బంగారం
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:34 PM
నోటిలో బంగారం దాచుకుని విమానంలో ప్రయాణించొచ్చని భావించాడు.. కానీ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయాడు. బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి ఏకంగా 82 గ్రాముల బంగారం క్యాప్సూల్స్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: నోటిలో బంగారం దాచుకుని విమానంలో ప్రయాణించొచ్చని స్కెచ్ వేశాడు.. కానీ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి అడ్డంగా దొరికిపోయాడు. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు నోటిలో క్యాప్సూల్స్ రూపంలో బంగారాన్ని దాచుకుని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ సీఐఎస్ఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఘజియాబాద్ వెళ్లే విమానం ఎక్కేందుకు టెర్మినల్-1లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భద్రతా తనిఖీలకు హాజరైన సమయంలో అతడి ప్రవర్తనపై సిబ్బందికి అనుమానం వచ్చింది. తనిఖీలు నిర్వహించగా.. అతడి నోటిలో దాచిన రెండు క్యాప్సూల్స్‌లో సుమారు 82 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రయాణికుడు అంతకుముందు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. తదుపరి విచారణ కోసం ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని స్వచ్ఛత పరీక్ష కోసం పంపినట్లు అధికారులు వెల్లడించారు. పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, బంగారాన్ని నోటిలో క్యాప్సూల్స్ రూపంలో దాచుకుని తరలించేందుకు ప్రయత్నించడం ఈ కేసులో ప్రత్యేకంగా నిలిచిందని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.