Share News

కులగణన తర్వాతే డీలిమిటేషన్‌ చేపట్టాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:54 AM

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లతో అగ్రకులాల ఆధిపత్యం ఇంకా పెరుగుతుందని... బీసీలకు రాజకీయ ప్రయోజనం ఉండదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు...

కులగణన తర్వాతే డీలిమిటేషన్‌ చేపట్టాలి

  • మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌తో మాకు ప్రయోజనం లేదు

  • బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లతో అగ్రకులాల ఆధిపత్యం ఇంకా పెరుగుతుందని... బీసీలకు రాజకీయ ప్రయోజనం ఉండదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. కులగణన తర్వాతే డీలిమిటేషన్‌ చేపట్టాలన్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను గౌరవించని మోదీకి తాను బీసీ ప్రధాని అని చెప్పుకొనే నైతికత లేదన్నారు. చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా బీసీలకు ఒరిగేది లేదన్నారు. బీసీ మహిళలకు సబ్‌ కోటా లేకుండా బిల్లుకు ఆమోదం పొందేందుకు కుట్రలకు పాల్పడితే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద డీలిమిటేషన్‌ పత్రాలను చింపివేసి నిరసన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో బీసీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. 12 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలోని 80 కోట్ల మంది బీసీలకు ఏమీ చేయలేదన్నారు. మాజీ ఎంపీ వీహెచ్‌ మాట్లాడుతూ.. బీసీ ప్రధాని కూడా బీసీలకు ద్రోహం చేస్తున్న చరిత్ర మోదీకే దక్కుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు మధుసూదనాచారి, శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక సంస్థలలో కల్పిస్తున్న విధంగా చట్టసభలలోనూ బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు మాట్లాడుతూ బీసీలంటే అన్ని పార్టీలకు చిన్న చూపు ఉందన్నారు. బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై 80 కోట్ల మంది బీసీలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తారని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 07:03 AM