Share News

దీదీకి మరో షాక్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:43 AM

పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే టీఎంసీ పార్టీ రెండు బృందాలుగా విడిపోగా. నందిగ్రామ్‌ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బరిలోకి దిగుతారని విస్తృత ప్రచారం జరిగింది.

దీదీకి మరో షాక్‌
DIDI

SNACHITA.jpg

  • నందిగ్రామ్‌ ఉప ఎన్నిక.. నామినేషన్‌

  • ఉపసంహరించుకున్న టీఎంసీ అభ్యర్థి

  • కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన మమత

  • ఇక మమతా తృణమూల్‌.. డెమొక్రటిక్‌

  • తృణమూల్‌.. రెండుగా టీఎంసీ

  • తాత్కాలిక పరిష్కారం చూపిన ఈసీ

  • ఓటు చోరీ, ప్రభుత్వం చోరీ.. ఇప్పుడు

  • పార్టీ చోరీ.. బీజేపీపై రాహుల్‌ విమర్శలు

కోల్‌కతా, సెప్టెంబరు 18 : పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే టీఎంసీ పార్టీ రెండు బృందాలుగా విడిపోగా. నందిగ్రామ్‌ ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బరిలోకి దిగుతారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ, మమత టీఎంసీ వర్గం నుంచి ఆ స్థానానికి నామినేషన్‌ వేసిన సంచితా ప్రదాన్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేపీ నేత, రాష్ట్రముఖ్యమంత్రి సువేందు అధికారితో గురువారం సమావేశమైన సంచితా ప్రదాన్‌.. శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్‌ దాఖలు గడువు ఇప్పటికే పూర్తవ్వగా.. మమత మరొకరిని బరిలోకి దించే అవకాశం లేకపోయింది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి తమ మద్దతు ప్రకటిస్తున్నామని మమత శుక్రవారం ప్రకటించారు. ఇదిలా ఉండగా మమత ఈ నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోని నందిగ్రామ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మిలాన్‌ ప్రదాన్‌ అరెస్టయ్యారు. భూసేకరణకు వ్యతిరేకంగా 2007లో నందిగ్రామ్‌లో చేపట్టిన ఆందోళనలకు సంబంధించిన కేసులో మిలాన్‌ను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్‌ ప్రకటించింది. 2007లో జరిగిన ఆందోళనల్లో 14మంది మరణించారు. కాగా, సంచితా నామినేషన్‌ ఉపసంహరణపై స్పందించిన మమత.. ప్రతిపక్షాలను అంతం చేసేందుకు బీజేపీ చేసిన కుట్ర ఇదని ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేనను ముక్కలు చేసిన బీజేపీ ఇప్పుడు టీఎంసీ విషయంలో కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టడమే లక్ష్యంగా ఇండియా కూటమితో కలిసి పని చేస్తానని మమత స్పష్టం చేశారు. కాగా, బెంగాల్‌లోని నందిగ్రామ్‌తోపాటు రెజీనగర్‌ నియోజకవర్గాల ఉప ఎన్నిక అక్టోబరు 6న జరగనుంది.


మమత పార్టీకి కొత్త ఎన్నికల గుర్తు

తృణమూల్‌ కాంగ్రెస్‌ రెండు వర్గాలకు ఎన్నికల సంఘం(ఈసీ) కొత్త పార్టీ పేర్లు, గుర్తులను ఖరారు చేసింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని వర్గానికి ‘మమతా ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ గుర్తు దక్కాయి. అరూపరాయ్‌ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న మరో వర్గానికి (రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలో ఏర్పడిన చీలిక వర్గం) ‘డెమొక్రటిక్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, ‘ఎన్వలప్‌’ (కవర్‌) గుర్తులను కేటాయిస్తూ ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబర్‌ 6న తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్‌, ముర్షీదాబాద్‌ జిల్లాలోని రెజినగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఈ రెండూ కొత్త పేర్లు, గుర్తులపై తలపడనున్నాయి. అంతకుముందు గురువారం రాత్రి ఈసీ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరు, అధికారిక గుర్తును (పూలు-గడ్డి) ఎవరూ ఉపయోగించుకోకుండా ఫ్రీజ్‌ చేయడం తెలిసిందే. రానున్న ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్యంతర ఏర్పాట్లు చేసినట్లు ఈసీ వివరించింది. పార్టీ పేరు, గుర్తులపై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆయా స్థానాలకు బరిలో దిగిన వారిని ఆయా కొత్త పార్టీల అభ్యర్థులుగా పరిగణించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. దీనిపై మమత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో టీఎంసీలో చీలిక ఏర్పడడం తెలిసిందే. ఈ రెండు వర్గాలు టీఎంసీ పేరు, పూలు-గడ్డి గుర్తు తమవే అని వాదిస్తున్నాయి.


ఆట మొదలైంది..

కొత్త గుర్తుల ఏర్పాటుపై మమతా వర్గానికి చెందిన ఎమ్మెల్యే కునాల్‌ ఘోష్‌ స్పందిస్తూ.. ఫుట్‌బాల్‌ ఆట దుస్తులను ధరించి, బంతితో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ఆట మొదలైంది’ అని సంకేతం ఇచ్చారు. మరోవైపు, మిలాన్‌ ప్రదాన్‌ అరెస్టు రాజకీయ కక్షతో చేసిందేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. మమత పార్టీకి వేరేగుర్తును కేటాయించడంపై స్పందిస్తూ.. ‘‘ఓటు చోరీ.. ప్రభుత్వం చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ’’ అని విమర్శించారు. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనికి బీజేపీ ప్రతినిధి సుధాన్షు త్రివేది స్పందిస్తూ,. కాంగ్రెస్‌ తన చరిత్రను తిరిగి చూసుకోవాలని.. ఆ పార్టీ గతంలో ఎన్నో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేసిందన్నారు. ఎన్టీ రామారావు వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కూల్చివేసిందన్నారు

ఈ వార్తలు కూడా చదవండి

పాక్‌ తయారీ ఫెయిర్‌నెస్‌ క్రీములపై కేంద్రం హెచ్చరిక

చిన్నారుల అశ్లీల వీడియోలపై దర్యాప్తు సంస్థలకు నివేదిస్తాం: మెటా

Updated Date - Sep 19 , 2026 | 03:52 AM