Share News

అనామక పార్టీలు.. భారీ విరాళాలు

ABN , Publish Date - Sep 07 , 2026 | 06:16 AM

అవి పేరుకే నమోదైన రాజకీయ పార్టీలు. ప్రజలకు పెద్దగా తెలిసినవి కావు. అయినప్పటికీ పేరున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను మించి విరాళాలు రాబడుతున్నాయి.

అనామక పార్టీలు..   భారీ విరాళాలు
Cash

  • జాతీయ, ప్రాంతీయ పార్టీల్ని మించి వసూలు

  • 2023-24లో 5 చిన్న పార్టీలకు రూ.1,700 కోట్లు

  • ఆమ్‌ జన్మత్‌ పార్టీకి రూ.620 కోట్లు..

  • బీజేపీ బిహార్‌ ఉపాధ్యక్షురాలే ఈ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షురాలు

  • మరో పార్టీకి 330 కోట్లు.. వీటికి అడ్రస్‌ గుజరాత్‌!

  • లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది 15 చోట్లే

  • కార్యకలాపాల్లేవు.. కానీ సంక్షేమం పేరుతో ఖర్చు

  • నిధుల మార్పిడికి వీలుకల్పించేందుకేనన్న సందేహాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: అవి పేరుకే నమోదైన రాజకీయ పార్టీలు. ప్రజలకు పెద్దగా తెలిసినవి కావు. అయినప్పటికీ పేరున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలను మించి విరాళాలు రాబడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్‌కు చెందిన ఆరు చిన్న పార్టీలకు విరాళాల రూపంలో రూ.1,700 కోట్లు అందిననట్టు ఓ మీడియా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఇవేవీ చురుకైన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం లేదని తేలింది. దీంతో ఈ విరాళాల అసలు లబ్ధిదారులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఆమ్‌ జన్మత్‌ పార్టీకి రూ.620 కోట్లు, సత్యవాది రక్షక్‌ పార్టీకి రూ.330.55 కోట్లు, స్వతంత్రత అభివ్యక్తి పార్టీకి రూ.219.69 కోట్లు, న్యూ ఇండియా యునైటెడ్‌ పార్టీకి రూ.200.69 కోట్లు, భారతీయ నేషనల్‌ జనతాదళ్‌కు రూ.191.61 కోట్లు, గరీబ్‌ కల్యాణ్‌ పార్టీకి రూ.138 కోట్లు చొప్పున 2023-24లో విరాళాలు అందాయి. 2024 ఎన్నికల్లో ఇవన్నీ కలసి పేరుకు 15 లోక్‌సభ స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టాయి. రూ.620 కోట్ల విరాళాలు అందుకున్న ఆమ్‌ జన్మత్‌ పార్టీ, రూ.330 కోట్లు స్వీకరించిన సత్యవాది రక్షక్‌ పార్టీ అయితే ఒక్కో అభ్యర్థినే పోటీకి దింపడం మరీ విచిత్రంగా ఉంది. మరీ ముఖ్యంగా.. ప్రస్తుతం బీజేపీ బిహార్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న అనామిక పాశ్వాన్‌ ఆధ్వర్యంలోనే.. ఆమ్‌ జన్మత్‌ పార్టీని 2020లో పట్నాలో స్థాపించారు. అయితే, ఆమ్‌ జన్మత్‌ పార్టీని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మార్చినప్పుడే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు ఆమె స్పష్టం చేశారు. 2022-23లోనూ ఈ పార్టీకి రూ.216 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక, 2023-24లో కాంగ్రె్‌సకు రూ.281.48 కోట్ల విరాళాలు అందినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, సీపీఎంకు రూ.7.64 కోట్లు, ఆప్‌కు రూ.10.15 కోట్ల విరాళాలు రాగా.. ప్రాంతీయ పార్టీలైన బీఆర్‌ఎస్ కు రూ.85 కోట్లు, డీఎంకేకు రూ.15.24 కోట్ల చొప్పునే రావడం గమనార్హం.


కార్యకలాపాలు పరిమితం..

గుజరాత్‌కు చెందిన ఈ ఆరు పార్టీల్లో నాలుగింటికి చిరునామా అహ్మదాబాద్‌. వీటి కార్యాలయాలు మూసి ఉండగా, పార్టీ ఆఫీస్‌ బేరర్లు కూడా అందుబాటులో లేరు. ఇందులో సత్యవాది రక్షక్‌ పార్టీ తనకు వచ్చిన రూ.330 కోట్లలో రూ.316 కోట్లను సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. రూ.8.48 కోట్లను లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్టు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్‌ నివేదికలో వెల్లడించింది. ఎన్నికల్లో పెద్దగా ఉనికేలేని, అనామక పార్టీలకు ఇంత భారీ మొత్తంలో విరాళాలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎవరికి చేరుతున్నా యి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో 2,800 నమోదిత, గుర్తింపులేని రాజకీయపార్టీల్లో 73శాతం తమ ఆర్థిక వివరాలను వెల్లడించలేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) గతేడాది జూలై నివేదికలో స్పష్టం చేసింది. ఆదాయపన్ను శాఖ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీటీటీ) 2025 డిసెంబర్‌లో ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించని, నమోదైన చిరునామాల్లో పనిచేయని కొన్ని పార్టీలను నిధుల మార్పిడికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - Sep 07 , 2026 | 06:17 AM