సింగర్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో అనుమానిత షూటర్ల హతం..
ABN , Publish Date - Aug 31 , 2026 | 09:22 AM
ప్రముఖ హర్యాన్వీ సింగర్, యూట్యూబర్ అంకిత్ బల్యాన్‌ను హత్య చేసినట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానిత షూటర్లు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హర్యాన్వీ సింగర్, యూట్యూబర్ అంకిత్ బల్యాన్‌ను హత్య చేసినట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానిత షూటర్లు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీలో ఆదివారం రాత్రి ఇద్దరు షూటర్లు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వారిని 24 ఏళ్ల సుమిత్, 22 ఏళ్ల మోహిత్‌గా గుర్తించారు. ఈ ఇద్దరు షూటర్లు గోగీ గ్యాంగ్‌కు చెందిన వారని తెలిపారు.
హర్యానాలోని సోనిపత్‌కు చెందిన వారిపై 50 వేల రూపాయల రివార్డు ఉందని వెల్లడించారు. హర్యానాలోని మోహిత్‌లో వారిపై 14 కేసులు ఉన్నాయని తెలిపారు. కాగా, ఆగస్టు 26వ తేదీన షామ్లీలోని జిమ్ వద్ద బల్యాన్‌పై ఆ ఇద్దరూ కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. జిమ్‌లో వ్యాయమం ముగిసిన తర్వాత బల్యాన్ బయటకు వచ్చాడు. బల్యాన్ తన కారు దగ్గరకు రాగానే ఆ ఇద్దరు 16 రౌండ్లు అతడిపై కాల్పులు జరిపారు.
అనంతరం అక్కడినుంచి పారిపోయారు. అప్పటినుంచి పరారీలో ఉన్నారు. హత్య జరిగిన మరుసటి రోజు గోగీ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి బల్యాన్ హత్యకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. సోషల్ మీడియా పోస్టు ఆధారంగా పోలీసులు నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆదివారం ఆ ఇద్దరు షూటర్లు పోలీసులకు ఎదురుపడ్డారు. వారు పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎదురు కాల్పుల్లో హతమయ్యారు.
ఇవి కూడా చదవండి
శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?
మాతృదేశానికి పయనమైన 90 ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానం