నవంబరు 1న ర్యాలీ నిర్ణయం.. రాహుల్ అవివేకానికి నిదర్శనం
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:39 AM
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు ప్రజల నుంచి మద్దతు లభించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు ప్రజల నుంచి మద్దతు లభించడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 1984 సిక్కుల ఊచకోత జరిగిన నవంబరు 1వ తేదీనే కాంగ్రెస్ పార్టీ రామ్‌లీలా మైదాన్‌లో ధర్నా నిర్వహించడం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అపరిపక్వతను, అవివేకాన్ని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పండుగ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని చిన్న వ్యాపారులు సూచించినప్పటికీ కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల.. ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందన్నారు. నెహ్రూ హయాం నుంచి ఫారం-6లో ఒక్క అక్షరమైనా ఎన్నికల కమిషన్ మార్చలేదని స్పష్టం చేశారు. దాంతో జతపరిచిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు.