Share News

రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయండి

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:25 AM

కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై...

రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయండి

  • ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై రాయ్‌బరేలీ పోలీసులకు అలహాబాద్‌ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తును నిర్వహించాలని, లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని పేర్కొంది. రాహుల్‌ గాంధీకి బ్రిటన్‌ పౌరసత్వం కూడా ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్‌.విఘ్నేశ్వర్‌ శిశిర్‌ రాయ్‌బరేలీలోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో గత ఏడాది డిసెంబరు 17న కేసు వేశారు. అయితే, పౌరసత్వానికి సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదంటూ జనవరి 28న కోర్టు శిశిర్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆయన అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ బ్రిటన్‌ పౌరసత్వానికి సంబంధించి తన వద్ద పత్రాలు ఉన్నాయని తెలిపారు. ఆయన బ్రిటిష్‌ పౌరుడనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయని వివరించారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్నందున రాహుల్‌ భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని, లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి కూడా వీల్లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌.. రాహుల్‌పై కేసు నమోదు చేయాలని రాయ్‌బరేలీ జిల్లాలోని కొత్వాలీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులను ఆదేశించింది. ఈ అంశంపై యూపీ సర్కారు స్వయంగా విచారణ జరపాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. రాహుల్‌ పౌరసత్వంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. రాహుల్‌ బ్రిటన్‌ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విఘ్నేశ్‌ శిశిర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్‌ గాంధీ డైరెక్టర్‌, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి కొంతకాలంగా చెబుతున్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్‌ తనను తాను బ్రిటిష్‌ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి ఆ దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై గతంలో కేంద్రానికి లేఖ కూడా రాశారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 06:25 AM