Share News

హిందూ మహాసముద్రం దేశాలను కలిపే వారధిగా ఉండాలి: అజిత్ డోభాల్

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:11 PM

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మరింత బలోపేతం కావాలని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం దేశాలను విభజించేదిగా కాకుండా, కలిపే వారధిగా నిలవాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు.

హిందూ మహాసముద్రం దేశాలను కలిపే వారధిగా ఉండాలి: అజిత్ డోభాల్
Ajit Doval

ఇంటర్నెట్ డెస్క్: హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మరింత బలోపేతం కావాలని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతం దేశాలను విభజించేదిగా కాకుండా, కలిపే వారధిగా నిలవాలని బుధవారం ఆయన స్పష్టం చేశారు. మాల్దీవుల రాజధాని మాలెలో జరుగుతున్న 8వ ‘కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్’ (సీఎస్‌సీ) జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో డోభాల్ పాల్గొన్నాను.


జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ డోభాల్ ప్రసంగిస్తూ.. మారుతున్న భద్రతా సవాళ్లను సమష్ఠిగా ఎదుర్కొనేందుకు భాగస్వామ్య దేశాల సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ వేదికను భారత్ ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ‘మహాసాగర్’ దార్శనికతతో అనుసంధానించారు. సముద్ర భద్రత, ఉగ్రవాద కట్టడి, అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ భద్రత, విపత్తు సహాయం వంటి ఐదు కీలక స్తంభాల ఆధారంగా సీఎస్‌సీ పనిచేస్తోంది. భారత్, మాల్దీవులు, శ్రీలంక, మారిషస్, బంగ్లాదేశ్, సీషెల్స్ ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి.హిందూ మహాసముద్రంలో చైనా తన ఆర్థిక, దౌత్య, నావికా ప్రభావాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో డోభాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన రవాణాకు కీలకమైన ఈ ప్రాంతంలో ద్వీప దేశాలు, పొరుగు దేశాలతో సమష్ఠి భద్రతా వ్యవస్థను నిర్మించేందుకు భారత్ కృషి చేస్తోంది.మరోవైపు సదస్సు సందర్భంగా మంగళవారం మాల్దీవుల రక్షణ, జాతీయ భద్రతా శాఖ మంత్రి హసన్ రషీద్‌తో డోభాల్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు ఇటీవల పాకిస్థాన్‌లో పర్యటించి రక్షణ, సముద్ర సహకారం సహా పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. న్యూఢిల్లీ, మాలె మధ్య జరిగిన ఈ ఉన్నత స్థాయి భేటీ దౌత్యపరంగా కీలకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 25 , 2026 | 06:19 PM