వాయుసేన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:07 AM
భారత వాయుసేన నూతన అధిపతి (ఎయిర్ చీఫ్ మార్షల్)గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 6: భారత వాయుసేన నూతన అధిపతి (ఎయిర్ చీఫ్ మార్షల్)గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండడంతో అదే రోజు మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతవరకు వైస్ చీఫ్‌గా ఉన్న దీక్షిత్ వాయుసేనకు 29వ అధిపతిగా వ్యవహరించనున్నారు. యుద్ధ విమానాల పైలట్‌గా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన ఆపరేషన్ సిందూర్‌లో వాయుసేనను నడిపించారు. తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్ తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1966 డిసెంబరు 9న జన్మించిన ఆయన 1986 డిసెంబరు 6న వాయుసేన యుద్ధ విభాగంలో చేరారు. మొత్తం 3,500 గంటల పాటు యుద్ధ విమానాలను నడిపారు. శిక్షకుడిగానూ గుర్తింపు పొందారు. యుద్ధ విమానాలైన మిరాజ్-2000, మిగ్, కిరణ్, జాగ్వార్, ఐఎల్-78, హాక్, తేజస్ అన్నింటినీ నడిపారు. ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్‌ల్లో పాలుపంచుకున్నారు. 2006లో వాయుసేనా మెడల్, 2011లో విశిష్ట సేవా మెడల్, 2023లో అతి విశిష్ట సేవా మెడల్, 2026లో పరమ విశిష్ట సేవా మెడల్‌లను అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన