Share News

ఈపీఎస్‌ వర్సెస్‌ షణ్ముగం

ABN , Publish Date - May 14 , 2026 | 06:05 AM

అన్నాడీఎంకే అధికారికంగా చీలిపోయింది. ఇప్పుడు వైరి వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. మాజీ సీఎం, పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి(ఈపీఎ్‌స)పై...

ఈపీఎస్‌ వర్సెస్‌ షణ్ముగం

అన్నాడీఎంకే ఓటమిపై పరస్పర ఆరోపణలు..

చీలిపోయిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు

  • ఎడప్పాడితో 22 మంది.. షణ్ముగంవైపు 25 మంది

చెన్నై, మే 13 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే అధికారికంగా చీలిపోయింది. ఇప్పుడు వైరి వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. మాజీ సీఎం, పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి(ఈపీఎ్‌స)పై సీనియర్‌ నేత సీవీ షణ్ముగం వర్గం అధికారికంగా తిరుగుబాటుచేసింది. ఆ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీలో విజయ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఇదే సమయంలో పళనిస్వామి వర్గంలోని 22 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. బలపరీక్ష అనంతరం ఈ పరిణామంపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. డీఎంకే మద్దతుతో తాను సీఎం అవ్వాలనుకున్నానంటూ షణ్ముగం చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘అన్నాడీఎంకే కూటమితో తప్ప మరెవరితోనూ మేం చర్చలు జరపలేదు. ఏనాడూ డీఎంకేతో చర్చించలేదు. టీవీకే ప్రభుత్వంలో చేరాలన్న ఆశతోనే మా పార్టీకి చెందిన కొంతమంది మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలమంతా టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం. అయితే మా పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు విప్‌ను ఉల్లంఘించి ప్రభుత్వానికి అక్రమంగా ఓటేశారు. స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్పే విజయ్‌.. అన్నాడీఎంకేలో చీలిక వర్గాన్ని కలవడం ఏం సమంజసం? ఏ నేతా విజయ్‌లాగా చీలికవర్గం వద్దకు వెళ్లలేదు. పదవి చేపట్టిన ఆరంభంలోనే ఆయన తప్పుడు మార్గం అనుసరించడం విచారకరం’ అని మీడియాకు తెలిపారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికిన 25 మంది ఎమ్మెల్యేలతో పాటు వారికి అండగా నిలిచిన నేతలందరినీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు పళనిస్వామి ప్రకటించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు.


మూడోస్థానం ఈపీఎస్‌ పుణ్యమే

ఎన్నికల్లో అన్నాడీఎంకే మూడో స్థానానికి దిగజారడానికి, ఓటమికి కారణం పళనిస్వామేనని అసమ్మతి నేతలు షణ్ముగం, ఎస్పీ వేలుమణి మండిపడ్డారు. బీజేపీతో పొత్తు వద్దని తాము ఆదిలోనే వారించామని, అయినా ఆయన తమ మాట వినలేదన్నారు. 47 సీట్లు గెలుచుకుని డీఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి కావాలన్న ఈపీఎస్‌ కోరికను తమలాంటి వారు వ్యతిరేకించారన్నారు. ‘డీఎంకే మద్దతుతో ముఖ్యమంత్రి అవుతానని, ఈ విషయమై ఢిల్లీలో బీజేపీతో మాట్లాడానని పళనిస్వామి మాతో చెప్పారు. నిజానికి వీసీకే నేత తిరుమావళవన్‌ను సీఎంను చేద్దామని డీఎంకే ప్రతిపాదించింది. తానే అవుతానని పళనిస్వామి మొండికేశారు. తనను ముఖ్యమంత్రి చేసేందుకు ఢిల్లీ పెద్దలు వ్యూహం రచించినట్లు పుదుచ్చేరి రిసార్టులో మాకు చెప్పారు’ అని షణ్ముగం తెలిపారు. తమను పదవుల నుంచి తొలగించే అధికారం ఈపీఎ్‌సకు లేదని, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 06:06 AM