Share News

ఐటీ కంపెనీలు ఐదేళ్లలో గాయబ్‌!

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:34 AM

ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్‌ మైక్రోసిస్టమ్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా ఆవిష్కరించారు. ఒక పక్క సామాన్యుల విద్య, వైద్యం, న్యాయ సహాయం...

ఐటీ కంపెనీలు ఐదేళ్లలో గాయబ్‌!

  • మనిషి కన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్‌ వస్తాయి

  • సన్‌ మైక్రోసిస్టమ్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్‌ మైక్రోసిస్టమ్స్‌ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా ఆవిష్కరించారు. ఒక పక్క సామాన్యుల విద్య, వైద్యం, న్యాయ సహాయం అవసరాలను కారుచౌకగా తీర్చే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్న కృత్రిమ మేథ(ఏఐ) అదే సమయంలో లక్షల మందికి వైట్‌ కాలర్‌ ఉపాధి అందిస్తున్న భారతీయ ఐటీ సేవల రంగానికి సమాధి కట్టనుందని ప్రకటించారు. సోమవారం ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ, బీపీవో కంపెనీల స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని అంచనా వేశారు. ఐదేళ్లలో ఈ కంపెనీలన్నీ దాదాపుగా అదృశ్యం అయిపోతాయని చెప్పారు. డబ్బు సంపాదనకు మనిషి చేస్తున్న పనుల్లో చాలావరకు ఏఐ మనిషికన్నా మెరుగ్గా చేసే పరిస్థితి వస్తుందని, ఈ దిశగా ఏఐ వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఏఐ కొద్ది రోజుల్లోనే స్వతంత్ర ఏఐ వర్కర్‌గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. దాంతో ప్రత్యేక నిపుణత అవసరం ఉన్న న్యాయవాద, వైద్య, చిప్‌ డిజైనింగ్‌ వృత్తుల్లో వచ్చే రెండు దశాబ్దాల్లో సమూల మార్పులు వస్తాయని అంచనా వేశారు. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్‌ విప్లవాలతో పోలిస్తే ప్రస్తుత ఏఐ విప్లవం పూర్తిగా విభిన్నమైనదని చెప్పారు. ‘‘అవి కొత్త వ్యాపారాలను ఆవిష్కరిస్తే ఇది ఏకంగా మేధో శ్రమను పునఃసృష్టించింది. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తిరంగంలో వినూత్న పరిణామాలు సంభవిస్తాయి’’ అన్నారు. భారతీయులు అవుట్‌ సోర్సింగ్‌ సేవల నుంచి ఏఐ ఆధార ఉత్పత్తులు, సేవలకు మారాలని సూచించారు. నిత్య జీవిత సేవల ఖర్చును ఏఐ బాగా తగ్గించగలదని ఖోస్లా అంచనా వేశారు. అత్యంత నాణ్యమైన వైద్యం, విద్య, న్యాయ సహాయం, ఇతర జ్ఞాన సంంధ సేవలు కారుచౌకగా ప్రజలకు అందుతాయని అన్నారు. తరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద మార్పుల్లో ఏఐ ఒకటని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 06:34 AM