ఏఐ కట్టుకథ.. సుప్రీంకోర్టు తీర్పా?
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:29 AM
ఓ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన వివరణలో.. ఏఐ (కృత్రిమమేధ) సృష్టించిన ఊహాజనిత తీర్పును సుప్రీంకోర్టు తీర్పుగా పేర్కొనటంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడింది
మధ్యప్రదేశ్ సర్కారుపై ఆ రాష్ట్ర హైకోర్టు మండిపాటు
ఓ కేసులో ప్రభుత్వం ఇచ్చిన వివరణపై అభ్యంతరం
సుప్రీంకోర్టు తీర్పుగా ప్రభుత్వం పేర్కొన్న దాన్ని
ఏఐ సృష్టిగా తేల్చిన ధర్మాసనం
ఇంత నిర్లక్ష్యం పనికిరాదని సర్కారుకు అక్షింతలు
భోపాల్, నవంబరు 19: ఓ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన వివరణలో.. ఏఐ (కృత్రిమమేధ) సృష్టించిన ఊహాజనిత తీర్పును సుప్రీంకోర్టు తీర్పుగా పేర్కొనటంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం ఏఐ టూల్స్‌ని గుడ్డిగా ఉపయోగించటం వల్ల ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. ‘ఒక డాక్యుమెంట్‌ను రూపొందించేముందు దాంట్లో ఏమైనా తప్పులున్నాయా అని సరిచూసుకోవటం కనీస వృత్తిధర్మం. దానిని కూడా నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా కల్పిత కేసును తీసుకొచ్చి చొప్పించారు. ఇది కోర్టు సమయాన్ని వృథా చేయటమేకాదు.. కోర్టును పక్కదారి పట్టించటం కూడా’ అని ఆక్షేపించింది. దీనికి సంబంధించిన వివరాలు.. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో మధ్యప్రదేశ్ పోలీసు విభాగంలో ఎస్సైగా పని చేస్తున్న పీయూష్ మణి తివారీని 2024లో ఉద్యోగంలోంచి తొలగించారు. ఆరోపణల మీద ప్రాథమిక విచారణ కూడా జరపకుండానే తనను శిక్షించారని పేర్కొంటూ పీయూష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై జాప్యం చేస్తే బాధిత మహిళను ఇబ్బంది పెట్టినట్లవుతుందని, నిందితుడు సాక్షులను బెదిరించటానికి అవకాశం ఉందని, ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తుందని, అందుకే తక్షణ చర్య తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో ‘(2008) 5 ఎస్సీసీ 230’ పేరిట ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-ఎస్ ఎస్ మహమ్మద్ నిస్సార్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అని పేర్కొంటూ ఓ తీర్పును తన వివరణలో ప్రస్తావించింది. విచారణ సందర్భంగా ఈ కేసును ధర్మాసనం పరిశీలించగా.. ఇది వాస్తవంగా జరిగింది కాదని, ఊహాజనితమైనదని వెల్లడైంది.
‘(2008) 5 ఎస్సీసీ 230’ పేరిట ఉన్న కేసు నిజానికి సిద్ధార్థ వశిష్ట్ అలియాస్ మనుశర్మ- ఢిల్లీ ప్రభుత్వం’కు సంబంధించినదని తేలింది. దానికి ప్రస్తుత కేసు విచారణకు ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా, గుడ్డిగా ఏఐ టూల్స్‌ని ఉపయోగించి, ఓ కల్పిత అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుగా పేర్కొందని ధర్మాసనం దుయ్యబట్టింది. రాజ్యాంగబద్ధమైన కోర్టుకు సమర్పించే పత్రాలను అత్యంత చిత్తశుద్ధితో రూపొందించాల్సి ఉంటుందని, దీంట్లో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించేముందు అన్ని పత్రాలనూ సంబంధిత ప్రభుత్వ న్యాయవాదులు క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి తప్పులు లేకుండా చూసుకునేలా అడ్వకేట్ జనరల్ కార్యాలయం చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, సదరు కేసులో ఉద్యోగం కోల్పోయిన ఎస్సై.. ఫిర్యాదు చేసిన మహిళను, సాక్షులను బెదిరిస్తాడనటానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఎస్సైని ఉద్యోగంలోంచి తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును కొట్టేసింది. అతడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం కావాలనుకుంటే ఎస్సై మీద శాఖాపరమైన విచారణ జరపవచ్చని తీర్పులో హైకోర్టు సూచించింది.