Share News

ఏఐ సాయం తీసుకున్నా..న్యాయమూర్తులే నిర్ణయం తీసుకోవాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 06:19 AM

కోర్టుల్లో నిత్యం చేసే సాధారణ పనులను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వేగంగా పూర్తి చేయవచ్చని.. అయితే తీర్పులు ఇవ్వడం, వాటికి కారణాలను వివరించడం మాత్రం న్యాయమూర్తుల బాధ్యతగానే ఉండాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.

ఏఐ సాయం తీసుకున్నా..న్యాయమూర్తులే నిర్ణయం తీసుకోవాలి
excji

  • కృత్రిమ మేధతో సాధారణ పనులు చేయించాలి

  • కేసులో ఆరోపణలు, ఆధారాలు, వ్యక్తిగత అంశాలను

  • న్యాయమూర్తులే స్వయంగా సమీక్షించాలి

  • తీర్పులు, వాటి వెనుక కారణాలు జడ్జీలే నిర్ణయించాలి

  • న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై మాజీ సీజేఐ చంద్రచూడ్‌

న్యూఢిల్లీ, నవంబరు 28: కోర్టుల్లో నిత్యం చేసే సాధారణ పనులను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వేగంగా పూర్తి చేయవచ్చని.. అయితే తీర్పులు ఇవ్వడం, వాటికి కారణాలను వివరించడం మాత్రం న్యాయమూర్తుల బాధ్యతగానే ఉండాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై శనివారం జరిగిన ‘అందరికీ ఏఐ: ఏఐ పాలన, విశ్వసనీయత.. న్యాయవ్యవస్థకు సాంకేతిక అందుబాటు, సాధికార భారత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తులు తమ సమయాన్ని తీర్పులు ఇవ్వడం, కేసులపై లోతుగా ఆలోచించడానికే కేటాయించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు. కోర్టుల్లో వాదనలను రికార్డు చేయడం, అనువదించడం, కేసుల జాబితా తయారు చేయడం, పిటిషన్లలో లోపాలను గుర్తించడం వంటి సాధారణ పనులను ఏఐ సమర్థంగా చేయగలదన్నారు.


అందువల్ల న్యాయమూర్తుల విలువైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. కానీ ఏఐతో మరింత సంక్లిష్టమైన పనులు చేయించేందుకు ప్రయత్నించినప్పుడే సమస్యలు మొదలవుతాయని.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ట్రయల్‌ కోర్టు ఉనికిలో లేని సుప్రీంకోర్టు తీర్పులను నాలుగింటిని ఆధారంగా తీసుకుని నిర్ణయం ఇచ్చిందని గుర్తు చేశారు. మరో కేసులో ఒక ట్రిబ్యునల్‌ నిజమైన సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించినా, అందులో లేని పేరాలను తమ తీర్పులో నుంచి ఉటంకించిందని తెలిపారు. అందువల్ల న్యాయమూర్తులు కేసులోని ఆరోపణలు, ఆధారాలు, వ్యక్తిగత పరిస్థితులను న్యాయమూర్తి స్వయంగా పరిశీలించాలని.. ప్రతి తీర్పును సమీక్షించి, సంతకం చేయాలని స్పష్టం చేశారు. ఏఐ రూపొందించిన ప్రతి న్యాయపరమైన సూచనను, అనువాదాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పారు. బెయిల్‌ మంజూరు, సాక్షుల విశ్వసనీయతను నిర్ణయించడం వంటి పనులకు ఏఐని వినియోగించవద్దని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి న్యాయమూర్తులకు ఏఐ వినియోగంపై శిక్షణ ఇవ్వాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ వ్యవస్థలను తనిఖీ చేయించాలని ప్రతిపాదించారు

Updated Date - Nov 29 , 2026 | 06:37 AM